
విరాట్ కోహ్లి
అతనిలో ఏదో శక్తి దాగి ఉందని ట్విటర్ వేదికగా..
ఇస్లామాబాద్ : వరుస సెంచరీలతో దూసుకుపోతున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తున్న విషయం తెలిసిందే. ఇటు అభిమానులు అటు మాజీ క్రికెటర్లు కోహ్లిపై పొగడ్తల వర్షం కురపిస్తున్నారు. అయితే పాకిస్తాన్ మాజీ క్రికెటర్, రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ మాత్రం కోహ్లికి ఓ లక్ష్యాన్ని నిర్ధేశించాడు. అతని బ్యాటింగ్‌పై ప్రశంసలు కురిపించిన షోయబ్.. అతనిలో ఏదో శక్తి దాగి ఉందని ట్విటర్ వేదికగా అభిప్రాయపడ్డాడు.
‘గువాహటి, విశాఖపట్నం, పుణె వేదికల్లో వరుసగా మూడు సెంచరీలు సాధించి కోహ్లిలో ఏదో ప్రత్యేక ఉంది. ఈ ఘనతనందుకున్న తొలి భారత క్రికెటర్ కోహ్లి. అతనో అద్భుత పరుగుల యంత్రం. ఇలానే 120 సెంచరీలు సాధించాలి. ఇది నేను కోహ్లికి నిర్ధేశించిన టార్గెట్’అంటూ ట్వీట్ చేశాడు.
ఇక అంతర్జాతీయ క్రికెట్‌లో 100 సెంచరీలతో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో ఉన్న విషయం తెలిసిందే. అయితే కోహ్లి తాజా ఫామ్, అతని వయసు చూస్తే ఈ రికార్డు అలవోకగా అధిగమిస్తాడనే భావన కలుగుతోంది. ఇప్పటికే కోహ్లి 62 సెంచరీలు(వన్డేల్లో 38, టెస్టుల్లో 24) పూర్తి చేసుకున్నాడు. అయితే విండీస్‌తో జరిగిన గత మ్యాచ్‌లో కోహ్లి సెంచరీ చేసినా మిడిలార్డర్ చేతులెత్తేయడంతో భారత్ ఓటమిపాలైన విషయం తెలిసిందే.