అంపైరింగ్ తప్పులతో ఆట మారిపోయింది: ధోనీ
ఆడలేక మద్దెల ఓడన్నట్లు ఉంది.. విదేశాల్లో ఆడేటప్పుడు అంపైర్ల తప్పుల వల్లే ఓడిపోయామని చెప్పే భారత క్రికెటర్లు.. సొంత దేశంలో కూడా అదే పల్లవి అందుకుంటున్నారు. దక్షిణాఫ్రికాతో ధర్మశాలలో జరిగిన టి-20 మ్యాచ్లో స్లాగ్ ఓవర్లలో బ్యాటింగ్ వైఫల్యం కారణంగా ఓటమిని మూటగట్టుకున్న టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. ఆ నెపాన్ని అంపైర్ల మీదకు నెట్టేశాడు. దక్షిణాఫ్రికా బ్యాట్స్మన్ డుమినీ చేసిన 68 పరుగులే ఆ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే.
అయితే రెండుసార్లు భారత బౌలర్లు డుమినీని ఎల్బీడబ్ల్యు చేసినట్లు అప్పీలు చేసినా, అంపైర్లు మాత్రం వాళ్లతో ఏకీభవించలేదు. ఆ రెండు సార్లూ అతడు అవుటయినట్లే ఉందని, ఇలాంటి కొన్ని నిర్ణయాల వల్ల మ్యాచ్ మొత్తం మారిపోతుందని ధోనీ వ్యాఖ్యానించాడు. డుమినీ ముందే అవుటైతే ఫలితం వేరేలా ఉండేదని అన్నాడు. చేతిలో మంచి స్కోరు ఉన్నా కూడా.. మన ఫాస్ట్ బౌలర్లు ప్రత్యర్థులను కట్టడి చేయడంలో అంతగా విజయం సాధించలేకపోయారని చెప్పాడు.