
వెల్లింగ్టన్: టీమిండియా-న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టులో ఫలితం ఖాయంగా కనబడుతోంది. ఈ మ్యాచ్‌లో ఇప్పటికే కివీస్ పైచేయి సాధించడంతో ఆ జట్టు విజయంపై ధీమాగా ఉంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా తన రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్ల నష్టానికి 144 పరుగులతో ఉంది. దాంతో న్యూజిలాండ్ నమోదు చేసిన తొలి ఇన్నింగ్స్ స్కోరుకు టీమిండియా ఇంకా 39 పరుగులు వెనుకబడే ఉంది. రేపు నాల్గో రోజు ఆటలో ఓవర్‌నైట్ ఆటగాళ్లు అజింక్యా రహానే(25 బ్యాటింగ్), హనుమ విహారి(15 బ్యాటింగ్) సుదీర్ఘ సమయం క్రీజ్‌లో ఉంటేనే మ్యాచ్‌లో పోరాడే అవకాశం ఉంటుంది. ఇదిలా ఉంచితే, భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 165 పరుగులకు ఆలౌట్ కాగా, అందులో రిషభ్ పంత్ ఔటైన తీరు ఆశ్చర్యపరిచింది. (ఇక్కడ చదవండి: ‘రిషభ్.. నీ రోల్ ఏమిటో తెలుసుకో’)
అనవసర పరుగు కోసం రహానే పిలుపు నివ్వడంతో రిషభ్ ముందుకు దూకాడు. సౌతీ వేసిన 59 ఓవర్ రెండో బంతిని రహానే ఆఫ్‌సైడ్ తరలించి పరుగు తీయాలని ఆరాటపడ్డాడు. అయితే బంతి ఫీల్డర్ సమీపంలోకి రావడంతో అవతలి ఎండోలో ఉన్న పంత్ పరుగుకు తటపటాయించాడు. కానీ అప్పటికే సగం క్రీజు వరకు రహానే వచ్చి ఆగాడు. దీంతో చేసేదేమి లేక పంత్ కూడా పరుగు కోసం ప్రయత్నం ప్రారంభించాడు. అయితే అప్పటికే బంతి అందుకున్న అజాజ్ పటేల్ నేరుగా వికెట్ల మీదకు త్రో విసిరాడు. అప్పటికీ పంత్ క్రీజు చేరుకోకపోవడంతో రనౌట్ అయ్యాడు. దీంతో పంత్ భారంగా క్రీజు వదిలి వెళ్లాడు. అయితే తొలి ఇన్నింగ్స్‌లో పంత్ రనౌట్ కాకుండా ఉంటే మ్యాచ్ మరోలా ఉండేదని అంటున్నాడు సౌతీ.
‘పంత్ రనౌట్..భారత్‌కు తీవ్ర నష్టం చేసేందనే చెప్పాలి. పంత్ వంటి బలమైన బ్యాట్స్‌మెన్ రెండో కొత్త బంతితో మరో బ్యాట్స్‌మెన్ రహానేతో కలిసి చాలా పరుగులు చేసేవాడు. అప్పటికే రహానే దూకుడుగా ఆడే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక పంత్‌కు పిచ్‌పై పట్టు దొరికిన క్రమంలో రనౌట్ అయ్యాడు. పంత్ చాలా ప్రమాదకరమైన బ్యాట్స్‌మన్. అతను క్రీజ్‌లో ఉంటే భారత్ గాడిలో పడేది. పంత్ రనౌట్ మ్యాచ్‌లో అతి పెద్ద టర్నింగ్ పాయింట్’ అని సౌతీ తెలిపాడు.