
కొలంబో: యార్కర్ల కింగ్ లసిత్ మలింగ వీడ్కోలు వన్డేలో శ్రీలంక ఘన విజయం సాధించింది. తద్వారా తమ వెటరన్ పేసర్‌కు మంచి బహుమతి ఇచ్చింది. బంగ్లాదేశ్‌తో శుక్రవారం ఇక్కడ జరిగిన తొలి మ్యాచ్‌లో లంక 91 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆతిథ్య జట్టు వన్‌డౌన్ బ్యాట్స్‌మన్, ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ కుశాల్ పెరీరా (99 బంతుల్లో 111; 17 ఫోర్లు, సిక్స్) సెంచరీకి తోడు, కుశాల్ మెండిస్ (49 బంతుల్లో 43; 4 ఫోర్లు), ఆల్ రౌండర్ ఏంజెలో మాథ్యూస్ (52 బంతుల్లో 48; 3 ఫోర్లు) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 314 పరుగులు చేసింది.
భారీ స్కోరు ఛేదనలో బంగ్లాను మలింగ (3/38) వరుస యార్కర్లతో కంగారుపెట్టాడు. ఓపెనర్లు, కెప్టెన్ తమిమ్ ఇక్బాల్ (0), సౌమ్య సర్కార్ (15)లను అతడు ఈ విధంగానే బౌల్డ్ చేశాడు. మొదట్లోనే కష్టాల్లో పడిన జట్టును ముష్ఫికర్ రహీమ్ (86 బంతుల్లో 67; 5 ఫోర్లు), షబ్బీర్ రెహ్మాన్ (56 బంతుల్లో 60; 7 ఫోర్లు)లు ఐదో వికెట్‌కు 111 పరుగులు జోడించి ఆదుకునే ప్రయత్నం చేశారు. వీరు వెనుదిరిగాక బంగ్లా పోరాటం ఎంతోసేపు సాగలేదు. తన చివరి ఓవర్లో ముస్తఫిజుర్ (18)ను ఔట్ చేసి ప్రత్యర్థి ఇన్నింగ్స్‌కు తెరదించి మ్యాచ్‌తో పాటు వన్డేలకు మలింగ సగర్వంగా బై బై చెప్పాడు.
మలింగ వన్డే కెరీర్
226 వన్డేల్లో 338 వికెట్లు
బౌలింగ్ సగటు 28.87
అత్యధిక వికెట్ల జాబితాలో 9వ స్థానం
అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన 6/38
Comments
Please login to add a commentAdd a comment