సాక్షి, విశాఖ: శ్రీలంకతో జరుగుతున్న నిర్ణయాత్మక మ్యాచ్‌లో భారత బౌలర్లు విజృంభించడంతో లంక భారత్‌కు 216 పరుగుల స్పల్ప లక్ష్యాన్ని నిర్ధేశించింది. లంక బ్యాట్స్‌మన్‌లలో తరంగ 95 ( 82 బంతులు, 12 ఫోర్లు, 3 సిక్సులు) సదీర సమరవిక్రమా 42(57 బంతుల్లో 5 ఫోర్లు) మినహా మిగతా బ్యాట్స్‌మెన్ చేతులెత్తయడంతో లంక 44.5 ఓవర్లకు 215 పరుగుల వద్ద ఆలౌట్ అయ్యింది. ఇక భారత బౌలర్లలో చహల్, కుల్దీప్‌లు మూడేసి వికెట్లు తీయగా పాండ్యా రెండు, బుమ్రా, భువనేశ్వర్‌లు ఒక వికెట్ తీశారు.
లంక ఆరంభం అదుర్స్
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లంక ఓపెనర్ గుణతిలక మరో సారి నిరాశపరిచాడు. అయినా మరో ఓపెనర్ తరంగ, సమరవిక్రమాతో కలిసి మంచి శుభారంభాన్ని అందించాడు. ఈ ఇద్దరు సమన్వయంతో ఆడుతూ వీలు చిక్కినప్పుడల్లా బంతిని బౌండరీలకు తరలించారు. పాండ్యా వేసిన 8 ఓవర్‌లో తరంగ ఏకంగా 5 ఫోర్లతో విరుచుకుపడ్డాడు. దీంతో పవర్ ప్లే ముగిసే సరికి లంక వికెట్ నష్టపోయి 68 పరుగుల చేసింది. అనంతరం మరింత స్పీడ్ పెంచిన ఈ జోడి స్కోరు బోర్డును వేగంగా పరుగెత్తించింది. ఈ దశలోనే తరంగ 36 బంతుల్లో 10 ఫోర్లతో కెరీర్‌లో 36వ అర్ధ సెంచరీ సాధించాడు. జట్టు స్కోర్ 136 పరుగుల వద్ద సదీర చహల్ బౌలింగ్‌లో అనవసర షాట్‌కు ప్రయత్నించి ధావన్‌కు చిక్కాడు. దీంతో రెండో వికెట్‌కు నమోదైన 121 పరుగుల భాగ స్వామ్యానికి తెరపడింది. అనంతరం క్రీజులోకి వచ్చిన మాథ్యూస్‌తో తరంగా ఏమాత్రం వేగం తగ్గించుకుండా పరుగులు చేశాడు.
మలుపు తిప్పిన ధోని స్టంప్ అవుట్..
భారత చైనామన్ కుల్దీప్ యాదవ్ వేసిన 27 ఓవర్ తొలి బంతిని ఉపుల్ తరంగ క్రీజు దాటి ఆడబోగా.. బంతిని అందుకున్న ధోని అంతే వేగంతో వికెట్లను కొట్టేశాడు. ఫీల్డ్ అంపైర్ థర్డ్ అంపైర్‌ను రివ్యూ కోరగా రిప్లయ్‌లో తరంగ సరిగ్గా తన లెగ్ ఆన్‌ది లైన్‌పై పెట్టె సమయంలో ధోని వికెట్లను గీరేశాడు. థర్డ్ అంపైర్ అవుట్‌గా ప్రకటించడంతో తరంగ సెంచరీ చేజారింది.
ఈ వికెట్ అనంతరం శ్రీలంక పేక ముక్కల్లా కుప్పకూలింది. ఇదే ఓవర్‌లో డిక్‌వెల్లా(8) అవుటయ్యాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన ఏ బ్యాట్స్‌మన్ నిలదొక్కుకోలేకపోయారు. మథ్యూస్(17), పెరీరా(6), పతిరణ(7) అఖిల ధనుంజయ(1), లక్మల్(1)లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. చివర్లో గుణరత్నే(17) కూడా అవుటవ్వడంతో శ్రీలంక ఇన్నింగ్స్ 44.5 ఓవర్లకే ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment