
కొలంబో: శ్రీలంక సారథి లక్మల్. బేసిక్‌గా బౌలర్. అలాగని ఒక్క వికెట్ తీయలేదు. తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగినా ఒక్క పరుగు (డకౌట్) చేయ లేదు. ఫీల్డర్‌గా ఓ క్యాచ్ కూడా పట్టలేదు. ఎవర్నీ రనౌట్ చేయలేదు. కీపర్ కాదు కాబట్టి స్టంపింగ్ అవకాశమే లేదు. మొత్తానికి ఈ టెస్టు ఆడినా... అన్ని రంగాల్లో ఎక్కడా భాగస్వామ్యం కాలేదు లక్మల్. అయితేనేం అతని సారథ్యంలోనే ఈ మ్యాచ్ లంక గెలిచింది. అతని చేతులతో సిరీస్‌ను తలకెత్తుకుంది. క్రికెట్‌లో ఏదైనా సాధ్యమే అన్నట్టు... ఇది కూడా సాధ్యమైందిపుడు!! దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులోనూ శ్రీలంక జట్టు 199 పరుగుల తేడాతో గెలిచింది. రెండు టెస్టుల సిరీస్‌ను 2–0తో క్లీన్‌స్వీప్ చేసింది. 490 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో నాలుగో రోజు 139/5 ఓవర్‌నైట్ స్కోరుతో సోమవా రం ఆట ప్రారంభించిన దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో 290 పరుగుల వద్ద ఆలౌటైంది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ బ్రుయిన్ (101; 12 ఫోర్లు) సెంచరీ సాధించాడు.
ఇతనికి బవుమా (63; 4 ఫోర్లు) సహకారం అందించాడు. ఇద్దరు ఆరో వికెట్‌కు 123 పరుగులు జోడించారు. 236 స్కోరు వద్ద హెరాత్... బవుమాను ఔట్ చేయడంతో సఫారీ ఇన్నింగ్స్ కూలేందుకు ఎంతోసేపు పట్టలేదు. మరో 13 ఓవర్ల వ్యవధిలో 54 పరుగులు జోడించి మిగతా నాలుగు వికెట్లను కోల్పోయింది. శ్రీలంక వెటరన్ స్పిన్నర్ రంగన హెరాత్ (6/98) మరోసారి మాయాజాలం చేసి దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ పతనాన్ని శాసిం చాడు. హెరాత్‌కు మరో ఇద్దరు స్పిన్నర్లు దిల్‌రువాన్ పెరీరా (2/90), అఖిల ధనుంజయ (2/67) సహకారం అందించారు. ఫలితంగా దక్షిణాఫ్రికా కోల్పోయిన 10 వికెట్లూ స్పిన్నర్ల ఖాతాలోకే వెళ్లాయి. తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక 338, దక్షిణాఫ్రికా 124 పరుగులు చేశాయి. 214 పరుగుల ఆధిక్యం పొందిన శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌ను 275/5 స్కోరు వద్ద డిక్లేర్ చేసి ప్రత్యర్థికి భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.
Comments
Please login to add a commentAdd a comment