ఎన్నాళ్లుగానో క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్న ఇండో-పాక్ క్రికెట్ సిరీస్ త్వరలో సాకారం కాబోతోంది. సాధారణంగా ఈ రెండు దేశాల మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే అభిమానులు వెల్లువెత్తుతారు. చాలా కాలంగా మ్యాచ్ ఏదీ జరగకపోవడంతో పాక్, భారత్ క్రికెట్ బోర్డులు తటస్థ వేదికపై సిరీస్ నిర్వహించాలని తలపెట్టాయి. ఈ విషయాన్ని పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అధ్యక్షుడు జకా అష్రఫ్ తెలిపారు. బీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాసన్ కూడా ఇందుకు అంగీకరించారని ఆయన అన్నారు.
శ్రీనివాసన్తో అష్రఫ్ ఇటీవల భేటీ అయ్యారు. భారత్, పాకిస్థాన్ జట్టుల మధ్య క్రికెట్ సిరిస్ ఏర్పాటుకు బీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాసన్ సుముఖత వ్యక్తం చేశారని సోమవారం లాహోర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అష్రఫ్ వెల్లడించారు. అయితే ఇరు దేశాల క్రికెట్ జట్లు మరో తటస్థ వేదికపై క్రికెట్ అడనున్నాయని తెలిపారు. అందుకు ఆస్ట్రేలియా లేదా ఇంగ్లాండ్ను ఎంచుకునే అవకాశం ఉందని అష్రఫ్ తెలిపారు.
భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య క్రికెట్ టెస్ట్ అంటే ఇరుదేశాలలోని క్రికెట్ అభిమానులకు టెన్షనే టెన్షన్. ఇరుదేశాల పోటీలలో ఏ దేశం విజయపతాకం ఎగురవేస్తుందా అని ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు టీవీలకు అతుక్కుపోతుంటారు. అయితే 2008లో ముంబై దాడుల తర్వాత ఇరుదేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో ఇరుదేశాల మధ్య క్రికెట్ టెస్ట్ సిరీస్లకు మంగళం పాడారు. దాంతో ఇరుగు పొరుగు దేశాల క్రికెట్ అభిమానులు తీవ్ర నిరాశతో ఉన్నారు. అయితే ఆ విషయాన్ని గ్రహించిన ఇరు దేశాల క్రికెట్ బోర్డులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశాయి.