
ముంబై: ఈ ఏడాది టి20 ప్రపంచకప్ ఆస్ట్రేలియాలో అక్టోబర్ 18 నుంచి నవంబర్ 15 వరకు జరగాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా అక్కడి ప్రభుత్వం సెప్టెంబర్ 30 వరకు విదేశీయులను తమ గడ్డపైకి అనుమతించడం లేదు. ఆ తర్వాత మిగిలే తక్కువ సమయంలో ప్రపంచకప్ నిర్వహించడం చాలా కష్టమని భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ అభిప్రాయపడ్డారు. అందుకు ప్రత్యామ్నాయంగా వేదికను భారత్‌కు మార్చవచ్చని ఆయన సూచించారు. ‘ప్రస్తుత పరిస్థితుల్లో ఆస్ట్రేలియాలో ప్రపంచకప్ జరగడం అంత సులువు కాదని అర్థమవుతూనే ఉంది. షెడ్యూల్ ప్రకారం 2021లో టి20 వరల్డ్‌కప్ భారత్‌లో జరగాలి. ఇప్పుడు ఈ రెండు బోర్డులు గనక చర్చించుకొని ఒక ఒప్పందానికి వస్తే వరల్డ్‌కప్ నిర్వహణను పరస్పరం మార్చుకోవచ్చు. భారత్‌లో కరోనా తీవ్రత తగ్గి పరిస్థితులు మెరుగుపడితే ఈ ఏడాది అక్టోబర్–నవంబర్‌లో టోర్నీ జరపవచ్చు. సరిగ్గా సంవత్సరం తర్వాత దాదాపు ఇదే తేదీల్లో ఆసీస్ గడ్డపై టోర్నీ నిర్వహించవచ్చు’ అని సన్నీ అభిప్రాయపడ్డారు. తాను చెబుతున్న విధంగా జరిపితే సెప్టెంబర్‌లో ఐపీఎల్ నిర్వహించడం చాలా బాగుంటుందని, వరల్డ్‌కప్‌కు సరైన సన్నాహకంగా ఉంటుందని కూడా ఆయన అన్నారు.