పోరాడాల్సిన సమయం
►సచిన్ సలహాలు తీసుకున్నా
►ఇంగ్లండ్‌తో వన్డేల్లో రాణిస్తా
►సురేశ్ రైనా ఇంటర్వ్యూ
లండన్: ప్రతి జట్టులోనూ ఒకరిద్దరు ప్రత్యేకమైన ఆటగాళ్లుంటారు. వారు తమ పాత్రకు మాత్రమే పరిమితం కాకుండా.. మైదానం లోపల, బయట చురుగ్గా వ్యవహరిస్తూ జట్టులో ఉత్సాహం నింపుతుంటారు. సహచరుల విజయాన్ని తన సక్సెస్‌గా భావిస్తూ సంతోషం పంచుకుంటారు. వారు జట్టులో ఉంటే ఎప్పుడూ కొత్త ఉత్సాహం తొణకిసలాడుతూనే ఉంటుంది. అలాంటి ఆటగాళ్లలో ఒకడు సురేష్ రైనా. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ ఆడేందుకు జట్టుతో కలిశాడు. టెస్టు సిరీస్‌లో ఓటమితో మానసికంగా కుంగిపోయి ఉన్న భారత జట్టులో తాను నూతనోత్సాహాన్ని నింపుతానని, పోరాడటమే ప్రస్తుతం తమ ముందున్న కర్తవ్యమని రైనా చెబుతున్నాడు. వన్డే సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో రైనాతో ఇంటర్వ్యూ
బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్ తర్వాత విరామంలో ఏం చేశారు?
ఇంగ్లండ్‌తో సిరీస్‌కు బయలుదేరడానికి అవసరమైన ఆత్మవిశ్వాసం పొందే ప్రయత్నం చేశాను. ఇందుకోసం ఢిల్లీ, నోయిడాలలో టర్ఫ్ వికెట్‌పై ప్రాక్టీస్‌తోపాటు కొన్ని మ్యాచ్‌లూ ఆడాను. లక్నోలో చిన్నప్పుడు బోర్డింగ్ స్కూల్ విద్యార్థిగా చదువుకున్నప్పటి స్పోర్ట్స్ కాలేజిలోనూ ప్రాక్టీస్ చేశాను. పదిరోజులు ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ)లోని ఇండోర్ స్టేడియంలో సాధన చేశాను.
బీకేసీలో సచిన్ సలహాలేమైనా పొందారా?
సచిన్ అక్కడికి బ్యాడ్మింటన్ ఆడేందుకు వచ్చేవారు. అర్జున్ టెండూల్కర్ నెట్స్‌లో ప్రాక్టీస్‌కు వచ్చాక అతని వద్దకు వెళ్లి సలహాలిచ్చేవారు. అదే సమయంలో నేను వెళ్లి ఇంగ్లండ్‌లో పరిస్థితుల గురించి సచిన్‌ను అడిగేవాణ్ని. సచిన్‌తోపాటు ప్రవీణ్ ఆమ్రేతో నా బ్యాటింగ్‌కు సంబంధించిన పలు విషయాలపై చర్చించాను. వారి సలహాలు తీసుకున్నాను.
ఇంగ్లండ్‌లో పరిస్థితులకు అనుగుణంగా ఏ విధంగా సిద్ధమయ్యారు? స్వింగ్ బౌలింగ్‌ను ఎదుర్కొనేందుకు ప్రాక్టీస్ ఏమైనా చేశారా?
స్వింగ్‌ను సమర్థంగా ఎదుర్కొనేందుకు వీలుగా టేపు వేసిన టెన్నిస్ బాల్‌తో ప్రాక్టీస్ చేశాను. తొలి వన్డేకు ముందు బ్రిస్టల్‌లో రెండు సెషన్లు సాధన చేస్తున్నాం. పరిస్థితుల్ని ఆకళింపు చేసుకోవడానికి ఈ మాత్రం ప్రాక్టీస్ సరిపోతుంది. కచ్చితంగా ఇంగ్లండ్‌తో వన్డేల్లో రాణిస్తాననే నమ్మకం ఉంది.
టెస్టు సిరీస్‌లో ఓడిన జట్టుతో కలిశారు. క్లిష్ట పరిస్థితుల్లో జట్టుతో పాటు కలవడం గురించి చెప్పండి?
ప్రస్తుతం జట్టు క్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కొంటోంది. ఇలాంటప్పుడే స్థైర్యాన్ని ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. అంతటి ఓటమిని అధిగమించి ముందుకు సాగడం కష్టమైన పనే అయినా.. అంతర్జాతీయ స్థాయిలో ఆడుతున్నప్పుడు పోరాటపటిమను ప్రదర్శించాల్సివుంటుంది. అయితే కొత్త ఆటగాళ్ల రాక జట్టుకు నూతనోత్సాహం అందిస్తుంది. టెస్టు సిరీస్‌లో ఆడిన ఆటగాళ్లు తమ పొరపాట్ల నుంచి పాఠం నేర్చుకునే ప్రయత్నంలో ఉన్నారు. వారికి మేం కొత్త స్ఫూర్తిని అందిస్తాం. ఇది జట్టుగా పోరాడాల్సిన సమయం.
సీనియర్ ఆటగాడిగా వన్డే జట్టులో చేరుతున్నారు.. జట్టులో సానుకూల దృక్పథం నింపే బాధ్యతను మీరే స్వయంగా తీసుకుంటారా?
మైదానం లోపల, బయట ఎప్పుడూ జట్టులో ఉత్సాహం నింపేందుకే నేను ప్రయత్నిస్తుంటాను. వికెట్ పడినప్పుడు బౌలర్ లేదా ఫీల్డర్ వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్లి అభినందించే మొదటి వ్యక్తిని నేను. ఇలాంటి చిన్న విషయాలే జట్టులో ఉత్సాహపూరిత వాతావరణం తెస్తాయి. ఒకరి నుంచి మరొకరికి ఇది స్ఫూర్తినిస్తుంది.
ఈ విషయాన్ని మా కోచ్ వద్ద నేర్చుకున్నాను. మహి (ధోని) కూడా ఎవరైనా మంచి క్యాచ్ పట్టినప్పుడు, అద్భుతంగా ఫీల్డింగ్ చేసినప్పుడు వారి భుజం తట్టాలని చెబుతుంటాడు. దీని ద్వారా ఆటలో మనం ఎంతగా లీనమవుతున్నామన్న విషయం అర్థమవుతుందంటాడు. అందుకే మైదానంలో నా పనికి మాత్రమే పరిమితం కాకుండా ఇతరుల్ని ఉత్సాహపరుస్తూ సానుకూల దృక్పథం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంటాను. గత పదేళ్లుగా నేను దీన్ని ఫాలో అవుతున్నాను. ఇప్పుడూ అదే చేస్తాను.
వన్డేల్లో బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుగా రావాలని మీరు తపన పడుతుంటారు. నాలుగో స్థానంలో ఆడడానికి, ఆరో స్థానానికి ఏమైనా తేడా ఉంటుందా?
రెండు కొత్త బంతుల నిబంధన వచ్చాక ఏ స్థానంలో ఆడినా దాదాపు ఒకేలా ఉంటోంది. కొద్దిసేపైనా కొత్త బంతిని ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగినా.. ప్రస్తుత టెయిలెండర్లు బ్యాటింగ్ బాగా చేయగలిగినవారు కాబట్టి వారితో కలిసి బ్యాటింగ్ చేయడం సులభమే. కానీ, ఆ సమయంలో దాదాపుగా పవర్ ప్లే అమల్లో ఉండి.. వికెట్లు కోల్పోయే అవకాశం ఉంటుంది. అందుకే కనీసం ఒక బ్యాట్స్‌మన్ క్రీజులో నిలదొక్కుకుని చివరిదాకా ఇన్నింగ్స్‌ను నడిపించాల్సిన బాధ్యత ఉంటుంది.
పార్ట్ టైమ్ ఆఫ్‌స్పిన్నర్‌గా మీ బాధ్యతను ఎంతవరకు సీరియస్‌గా తీసుకుంటారు?
మ్యాచ్‌లో నాలుగైదు ఓవర్లు, ఒక్కోసారి అంతకంటే ఎక్కువ ఓవర్లు బౌలింగ్ చేసే అవకాశం లభిస్తుంది. అందుకు తగ్గట్టుగానే నేను సిద్ధంగా ఉంటాను. అయితే ప్రధానంగా పరుగుల వేగాన్ని అడ్డుకోవడమే నా బాధ్యతగా ఉంటుంది. కానీ, ఇటీవల టెస్టు సిరీస్‌ను గమనించాక.. బంతితోనూ రాణించే దిశగా దృష్టి పెడుతున్నాను.
సౌరవ్ గంగూలీతోనూ కొద్దిసేపు ముచ్చటించినట్లున్నారు.. ఏ విషయంపై మాట్లాడారు?
స్వయంగా ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ అయిన సౌరవ్.. సాంకేతిక పరమైన విషయాల్లో సలహాలిచ్చారు. ప్రధానంగా ఇంగ్లండ్‌లో బ్యాటింగ్‌కు మానసికంగా ఎలా సిద్ధం కావాలో చెప్పారు.
బ్రిస్టల్‌లో మూడేళ్ల తరువాత..
బ్రిస్టల్: భారత్, ఇంగ్లండ్‌ల మధ్య సోమవారం జరిగే తొలి వన్డే కోసం బ్రిస్టల్‌లోని క్రికెట్ అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక్కడి బ్రిస్టల్ కౌంటీ గ్రౌండ్‌లో అంతర్జాతీయ మ్యాచ్ జరిగి ఇప్పటికి మూడేళ్లు కావడమే అందుకు కారణం. 2011, జూన్‌లో ఇంగ్లండ్, శ్రీలంకల మధ్య టి20 మ్యాచ్ జరిగాక మళ్లీ ఇక్కడ మ్యాచ్ జరగలేదు. ఇక వన్డే మ్యాచ్ అయితే 2010 జూలైలో ఇంగ్లండ్, బంగ్లాదేశ్ మధ్య జరిగినదే చివరిది. అయితే సీటింగ్ సామర్థ్యం, సౌకర్యాలు మెరుగు పరచడం కోసం ఈ విరామం వచ్చింది. ప్రస్తుతం 15 వేల సీటింగ్ సామర్థ్యంతో గ్రౌండ్ సిద్ధమైంది.