దక్షిణాఫ్రికాకు భారీ లక్ష్యం
ధర్మశాల: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి ట్వంటీ20 మ్యాచ్ లో టీమిండియా 200 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ చేపట్టిన టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. భారత్ స్కోరు 22 పరుగుల వద్ద ఉండగా ఓపెనర్ శిఖర్ ధవన్(3) అనవసర పరుగుకోసం యత్నించి రనౌట్ గా పెవిలియన్ చేరాడు.
అనంతరం రోహిత్ శర్మ తనదైన శైలిలో రెచ్చిపోయాడు. దక్షిణాఫ్రికా బౌలర్లకు పరీక్షగా నిలుస్తూ(106; 66బంతుల్లో 12 ఫోర్లు, 5 సిక్సర్లు) సెంచరీని పూర్తి చేశాడు. దీంతో అంతర్జాతీయ ట్వంటీ20 ల్లో తొలి సెంచరీని రోహిత్ నమోదు చేశాడు. రోహిత్ కు జతగా విరాట్ కోహ్లి (43) రాణించడంతో రెండో వికెట్ కు 138 పరుగుల భాగస్వామ్యం నమోదైంది. కాగా, విరాట్, రోహిత్ వికెట్లను వరుసగా కోల్పోవడంతో టీమిండియా వేగం తగ్గింది. విరాట్ రెండో వికెట్ రూపంలో వెనుదిరిగగా, రోహిత్ మూడు వికెట్ గా పెవిలియన్ కు చేరాడు.
అటు తరువాత స్కోరును పెంచే యత్నంలో సురేష్ రైనా(14) అవుటయ్యాడు. కాగా, అజింక్యా రహానే స్థానంలో తుది జట్టులో కలిసిన అంబటి రాయుడు డకౌట్ గా వెనుదిరగగా, కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని(20) నాటౌట్ మిగలడంతో టీమిండియా నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసింది.