
భావోద్వేగాల నడుమ...
ఆరు వారాల కిందట హ్యూస్ మరణించడంతో భావోద్వేగాల మధ్య ప్రారంభమైన టెస్టు సిరీస్... ఇప్పుడు తుది అంకానికి చేరుకుంది. సహచరుడి కోసం ఏ మైదానంలో అయితే క్రికెటర్లు కన్నీళ్లు కార్చారో... ఇప్పుడు మళ్లీ అదే గ్రౌండ్‌లో మ్యాచ్ ఆడబోతున్నారు. దీంతో సహజంగా ఆటతో పాటు అప్పటి ఉద్విగ్న క్షణాలపై కూడా చర్చ మొదలైంది. హ్యూస్ జ్ఞాపకాలు ఆసీస్ జట్టును వెంటాడుతుంటే... కొత్త కెప్టెన్ కోహ్లి సారథ్యంలో భారత్ నవశకం వైపు అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో సిడ్నీ క్రికెట్ మైదానంలో నేటి నుంచి జరగనున్న నాలుగో టెస్టు ప్రాధాన్యత సంతరించుకుంది.
సిడ్నీ: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ చేజారినప్పటికీ... భారత క్రికెట్ జట్టు మాత్రం కొత్త శకంలోకి అడుగుపెడుతోంది. విజయవంతమైన కెప్టెన్‌గా పేరు తెచ్చుకున్న ధోని టెస్టులకు వీడ్కోలు పలికిన తర్వాత కొత్త సారథి విరాట్ కోహ్లి నేతృత్వంలోని టీమిండియా తొలి మ్యాచ్ ఆడబోతోంది. దీంతో ఐదు రోజుల ఫార్మాట్‌లో భారత్ దశా, దిశ ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో సిడ్నీ మైదానంలో నేటి నుంచి భారత్, ఆస్ట్రేలియాల మధ్య చివరిదైన నాలుగో టెస్టు జరగనుంది.
సిరీస్‌లో 0-2తో వెనుకబడిన భారత్.. మెల్‌బోర్న్‌లో డ్రాతో సరిపెట్టుకుంది. అయితే సిడ్నీలో మాత్రం పక్కా ప్రణాళికలతో విజయం కోసం బరిలోకి దిగుతోంది. ఈ సిరీస్‌లో మూడు శతకాలు సాధించిన కెప్టెన్ కోహ్లి నాయకత్వ ప్రతిభపై కూడా ఆసక్తికర చర్చ జరుగుతోంది. మైదానంలో దూకుడుగా ఉండే విరాట్... ఒత్తిడిని ఎలా జయిస్తాడని అందరూ ఎదురుచూస్తున్నారు. వ్యక్తిగత ప్రదర్శనతో అడిలైడ్‌లో జట్టును విజయం దరిదాపుల్లోకి తెచ్చినా... సిడ్నీలో సహచరులను నడిపించడంలో ఎలా వ్యవహరిస్తాడో చూడాలి.
20 వికెట్లు తీయలేకే...
బ్యాటింగ్‌లో విరాట్‌సేన బలంగా కనిపిస్తున్నా... బౌలింగ్ మాత్రం తీవ్రంగా కలవరపెడుతోంది. ఒక్క మ్యాచ్‌లో కూడా బౌలర్లు 20 వికెట్లు తీయలేకపోతున్నారు. ఈ ఒక్క కారణంతోనే భారత్ టెస్టు విజయాల్లో వెనుకబడిపోతోంది. డిసెంబర్ 2013 నుంచి భారత్ ఆడిన టెస్టులను పరిశీలిస్తే... ప్రతి మ్యాచ్‌లోనూ వచ్చిన అవకాశాలను బౌలర్లు సద్వినియోగం చేసుకోలేపోయారు. దీంతో ప్రస్తుతం సరైన బౌలర్లను ఎంపిక చేసుకోవడం కోహ్లిపైన ఉన్న అతిపెద్ద బాధ్యత. అయితే ఈ మ్యాచ్‌లో అతను ఐదుగురు బౌలర్ల వ్యూహాన్ని అమలు చేస్తాడో లేదో చూడాలి.
ధోని స్థానంలో సాహా జట్టులోకి రానున్నాడు. తాత అంత్యక్రియల కోసం భారత్‌కు వచ్చిన వరుణ్ ఆరోన్ ఆసీస్‌కు తిరిగొచ్చాడు. భువనేశ్వర్ నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఉమేశ్, షమీ, కులకర్ణి బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశారు. స్పిన్నర్లలో అశ్విన్, కరణ్, అక్షర్‌లు కూడా సిద్ధంగా ఉన్నారు. దీంతో కోహ్లి వీళ్లలో ఎవర్ని ఎంచుకుంటాడో చూడాలి. ఇక బ్యాటింగ్‌లో ఓపెనర్‌గా ధావన్ విఫలమవుతున్నాడు. ఇతని స్థానంలో లోకేశ్‌ను ప్రమోట్ చేసి మిడిలార్డర్‌లో రైనాను తీసుకుంటారా? పేలవ ఫామ్‌తో ఇబ్బందిపడుతున్న పుజారాను కొనసాగిస్తారా? లేదా రోహిత్‌ను తీసుకొస్తారా? కోహ్లి తుది జట్టు కూర్పు ఎలా ఉండబోతోందన్నది వేచి చూడాల్సిందే.
ఆత్మ విశ్వాసంతో ఆసీస్
మరోవైపు మంచి ఆత్మ విశ్వాసంతో ఉన్న ఆసీస్ ఈ సిరీస్‌ను విజయంతో ముగించాలని భావిస్తోంది. అయితే ఇదే మైదానంలో హ్యూస్ మరణించడంతో అతని జ్ఞాపకాలు సహచరులను వెంటాడుతున్నాయి. ఇలాంటి భావోద్వేగ పరిస్థితును కంగారులు అధిగమిస్తారా లేదో చూడాలి. ఈ మ్యాచ్‌కు హ్యూస్ కుటుంబ సభ్యులు హాజరయ్యే అవకాశం ఉండటంతో పరిస్థితి మరింత భిన్నంగా ఉండనుంది. బ్యాటింగ్‌లో అందరూ ఫామ్‌లో ఉండటం జట్టుకు కలిసొచ్చే అంశం. బౌలింగ్‌లో జాన్సన్ లేని లోటును స్టార్క్ తీరుస్తాడో లేదో చూడాలి. ఓవరాల్‌గా భారత బ్యాటింగ్‌కు ఆసీస్ బౌలర్లకు ఈ మ్యాచ్ సవాలుగా మారనుంది.
జట్లు (అంచనా)
భారత్: కోహ్లి (కెప్టెన్), విజయ్, ధావన్, పుజారా, రహానే, రైనా / రాహుల్, సాహా, అశ్విన్, భువనేశ్వర్ / ఉమేశ్, వరున్ ఆరోన్, ఇషాంత్ శర్మ.
ఆస్ట్రేలియా: స్మిత్ (కెప్టెన్), రోజర్స్, వార్నర్, వాట్సన్, మార్ష్, బర్న్స్, హాడిన్, హారిస్, స్టార్క్, హాజెల్‌వుడ్, లయోన్.
భారత్... బోటు షికారు సిడ్నీలోని భారత హై కమిషనర్ విరాట్‌సేనకు ఆదివారం సాయంత్రం విందు ఇచ్చారు. ఈ సందర్భంగా జట్టు మొత్తం సిడ్నీ హర్బర్‌లో క్రూయిజ్‌లో ప్రయాణించింది. తర్వాత ‘షో బోట్ల’లో ప్రయాణిస్తూ ఉత్సాహంగా గడిపింది.
విందుకు హాజరైన ఆటగాళ్లను హైకమిషనర్ బీరెన్ నందా సాదరంగా ఆహ్వానించారని బీసీసీఐ పేర్కొంది. జట్టు తరఫున కోహ్లి... నందాకు కతృ జ్ఞతలు తెలిపాడు. ఈ మ్యాచ్‌లోనూ పోరాట పటిమను చూపుతామని హామీ ఇచ్చాడు. గతంలో హైకమిషనర్లు ఇచ్చిన విందుకు భిన్నంగా ఇది సాగిందని, ఆటగాళ్లు 90 నిమిషాల పాటు సాగిన క్రూయిజ్ ప్రయాణాన్ని ఆస్వాదించారన్నాడు. విందుకు వచ్చిన అతిథులతో కలిసి ఫొటోలకు ఫొజులిచ్చిన క్రికెటర్లు... ఆటోగ్రాఫ్‌లు ఇస్తూ బిజీగా గడిపారు.
మ్యాచ్ ముగిశాక డ్రెస్సింగ్ రూమ్‌లో ధోని రిటైర్మెంట్ విషయం చెప్పాడు. అంతే అందరూ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఏం మాట్లాడాలో కూడా తోచలేదు. ఎందుకంటే మహి ఉద్వేగ క్షణాల్లో ఉన్నాడు. మేం కూడా అదే పరిస్థితిలో ఉన్నాం. కఠిన పరిస్థితుల్లో ఎలా ఉండాలో ధోనిని చూసి చాలా నేర్చుకున్నా. కీలక సమయాల్లో తుది జట్టును ఎంచుకోవడం, నిర్ణయాలు తీసుకోవడంలో అతని తర్వాతే ఎవరైనా.
ఈ అంశాలే కెప్టెన్‌కు చాలా కీలకం. అడిలైడ్ టెస్టు తర్వాత మెరుగుపడాల్సిన విషయాలను విశ్లేషించుకున్నా. ఆటలో చేస్తున్న తప్పులను సరిదిద్దుకోవాలని భావిస్తున్నా. ప్రతికూల సమయంలో కూడా సరైన నిర్ణయాలు తీసుకునేందుకు ప్రయత్నిస్తా. ప్రతిసారీ సానుకూల దృక్పథంతో ఆడతా. బౌలర్లు శక్తి మేరకు కష్టపడుతున్నా ఫలితాలు అందడం లేదు. ఓవరాల్‌గా ఓ మంచి టెస్టు జట్టుగా రూపాంతరం చెందాల్సిన అవసరం ఉంది -కోహ్లి (భారత కెప్టెన్)
తొలి టెస్టులో కోహ్లి బాధ్యతలు బాగానే నిర్వర్తించాడు. కాకపోతే కాస్త దూకుడు ఎక్కువ. ఈ వారంలోనే భారత్ తరఫున రెండో కెప్టెన్‌తో మ్యాచ్ ఆడబోతున్నా. సిడ్నీ నాకు ఫెవరేట్ మైదానం. కాబట్టి ఈ మ్యాచ్‌పై పూర్తిగా దృష్టిపెట్టా. జాన్సన్ గాయంతో బాధపడుతున్నాడు. వరల్డ్‌కప్‌ను దృష్టిలో పెట్టుకుని అతన్ని పక్కకు తప్పించాం. మిగతా వారంతా ఫిట్‌గా ఉన్నారు. ఈ మ్యాచ్‌లో భావోద్వేగాలు ఉంటాయి. హ్యూస్ జ్ఞాపకాలు మాలో ఇంకా కదలాడుతూనే ఉన్నా యి. మైదానంలో మాటల యుద్ధం సహజం -స్మిత్ (ఆసీస్ కెప్టెన్)
పిచ్, వాతావరణం
ఆసీస్‌లో ఇతర వేదికల కంటే సిడ్నీ పిచ్ స్పిన్‌కు ఎక్కువ సహకరిస్తుంది. వికెట్‌పై గడ్డి ఎక్కువగా ఉండటంతో స్పిన్‌తో పాటు రివర్స్ స్వింగ్‌కు అనుకూలం. మ్యాచ్ జరిగే రోజుల్లో ఉష్ణోగ్రత 20 డిగ్రీల కంటే ఎక్కువగానే ఉంటుంది. అయితే అప్పుడప్పుడు చిరుజల్లులు పడే అవకాశాలున్నాయి.
సిడ్నీలో ఆడిన చివరి 11 టెస్టుల్లో ఆస్ట్రేలియా 10 మ్యాచ్‌ల్లో గెలిచింది. 2010-11 యాషెస్ సిరీస్‌లో మాత్రం ఇంగ్లండ్ చేతిలో ఓడింది.
ఈ మ్యాచ్‌లో విరాట్ సెంచరీ చేస్తే... ఒక టెస్టు సిరీస్‌లో నాలుగు శతకాలు చేసిన హెర్బెర్ట్ సుట్ల్కిఫ్, వాలీ హామండ్స్ సరసన నిలుస్తాడు.