
తెలుగు టైటాన్స్ గెలిచింది...
కొంత విరామం తర్వాత తెలుగు టైటాన్స్ మళ్లీ గెలిచింది.
ప్రొ కబడ్డీ లీగ్
ముంబై: కొంత విరామం తర్వాత తెలుగు టైటాన్స్ మళ్లీ గెలిచింది. ప్రొ కబడ్డీ లీగ్‌లో గురువారం జరిగిన పోరులో టైటాన్స్ 33–28 స్కోరుతో తమిళ్ తలైవాస్‌పై విజయం సాధించింది. డిఫెండర్ సోమ్‌బీర్ (10) టాకిల్‌లో అద్భుతంగా రాణించాడు. రైడింగ్‌లో విఫలమైనప్పటికీ... మ్యాచ్‌లో గెలిచిందంటే అది సోమ్‌బీర్ ప్రదర్శన వల్లే! అతని ఉడుం‘పట్టు’కు ప్రత్యర్థి రైడర్లు సులభంగా చేతికి చిక్కారు. అతను టాకిల్‌కు ప్రయత్నించిన పది సార్లు కూడా సఫలం కావడం విశేషం. రైడింగ్‌లో నీలేశ్ సాలుంకే 5, రాహుల్ చౌదరి 3 పాయింట్లు సాధించారు. మిగతావారిలో ఫర్హాద్ మిలగర్దన్ (4), మోసిన్ (3) రాణించారు.
తమిళ జట్టు తరఫున అజయ్ ఠాకూర్ (8) ఆకట్టుకున్నాడు. ప్రపంజన్ 5, దర్శన్ 4, అమిత్ హుడా, ప్రదీప్ చెరో 2 పాయింట్లు చేశారు. ఇప్పటి వరకు 12 మ్యాచ్‌లాడిన టైటాన్స్‌కు ఇది మూడో విజయం. గురువారం జరిగిన మరో మ్యాచ్‌లో యు ముంబా 36–32 స్కోరుతో జైపూర్ పింక్ పాంథర్స్‌పై గెలుపొందింది. నేడు జరిగే మ్యాచ్‌లో బెంగాల్ వారియర్స్‌తో పట్నా పైరేట్స్‌తో తలపడనుంది.