
థాంక్యూ బ్రెజిల్
ప్రపంచకప్ అప్పుడే ముగిసిందా..! ఆటగాళ్ల అద్భుత విన్యాసాలు మళ్లీ నాలుగేళ్ల దాకా ఉండవా! ఇదీ... ప్రస్తుతం సగటు సాకర్ అభిమాని మనసులోని భావన. నెలరోజులపాటు ఫుట్‌బాల్ ప్రపంచకప్ పోటీల వినోదంలో ఓలలాడిన అభిమానులకు ఈ టోర్నీ ఎన్నో మధుర జ్ఞాపకాలను మిగిల్చింది. వాటిని నెమరు వేసుకోవడమే ఇక మిగిలింది.
రొనాల్డో జట్టు నిష్ర్కమిస్తే బాధపడ్డారు.. స్వారెజ్ చేష్టలకు
ఛీత్కరించుకున్నారు... నెయ్‌మార్ ఏడిస్తే తల్లడిల్లారు... మెస్సీ గోల్స్ చేస్తే తామే చేసినంత సంబరపడ్డారు... జర్మనీ కప్ గెలుచుకుంటే తామే చాంపియన్లయినట్లు గర్వపడ్డారు. ఫుట్‌బాల్‌పై అభిమానం.. దేశాలను, ఖండాలను దాటి ప్రపంచాన్ని ఒక్కటి చేసింది. ఎవరు ఏ దేశానికి మద్దతు పలికినా.. ఏ ఆటగాడిని అభిమానించినా.. అంతిమంగా ఫుట్‌బాల్‌ను గెలిపించారు.
గతంలో ఎన్నో ప్రపంచకప్‌లు జరిగినా.. అన్నింటినీ తలదన్నే విధంగా నిర్వహించిన బ్రెజిల్ ఆతిథ్యం అమోఘం. ప్రపంచకప్ కోసం తమ శక్తికి మించి ఖర్చు చేస్తున్నారన్న విమర్శలు ఎదురైనా.. స్వదేశంలో ప్రజలు నిరసన తెలిపినా.. సమర్థవంతమైన నిర్వహణతో చివరికి అదే ప్రజలతో జేజేలు కొట్టించుకుంది. తమ జట్టు ప్రపంచకప్‌ను గెలవకపోయినా.. ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల హృదయాలను బ్రెజిల్ గెలుచుకుంది. ఇక మళ్లీ ప్రపంచకప్ వినోదాల సందడి కోసం 2018 దాకా ఎదురు చూడాల్సిందే. వచ్చేసారి రష్యాలో బ్రెజిల్‌ను మించిన ఆనందం లభిస్తుందని ఆశిద్దాం. ఏమైనా ఇంత గొప్పగా ప్రపంచకప్‌ను నిర్వహించినందుకు థాంక్యూ బ్రెజిల్..!