
నంబర్ వన్ ఆట!
సమష్టిగా రాణించిన భారత ఆటగాళ్లు
కివీస్‌పై అన్ని రంగాల్లో ఆధిపత్యం
మరో 10 టెస్టులకు రెడీ
సొంతగడ్డపై భారత జట్టు మళ్లీ తిరుగులేని ప్రదర్శనతో మరో సిరీస్‌ను తమ ఖాతాలో వేసుకుంది. న్యూజిలాండ్‌పై మూడు టెస్టుల్లోనూ కోహ్లి సేన సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించింది. ఓవరాల్‌గా అశ్విన్ ప్రదర్శనతోనే మన జట్టు సిరీస్ గెలిచినట్లుగా కనిపిస్తున్నా... ఇతర బౌలర్లు, బ్యాట్స్‌మెన్ కూడా తమదైన కీలక పాత్ర పోషించారు. గత దక్షిణాఫ్రికా సిరీస్‌తో పోలిస్తే ఈ సారి పిచ్‌లపై పెద్దగా చర్చ జరగకపోవడం కూడా మరో మంచి పరిణామం. స్వదేశంలో వరుసగా మరో 10 టెస్టులు ఆడాల్సి ఉంది. భారత్‌లో క్రితం సారి ఆడినప్పుడు సిరీస్ నెగ్గిన ఇంగ్లండ్, వైట్‌వాష్‌కు గురైన ఆస్ట్రేలియా జట్లు ఇక్కడ పర్యటించబోతున్నారుు. ఈ నేపథ్యంలో కివీస్‌తో క్లీన్‌స్వీప్ విజయం మన టీమ్ ఆత్మవిశ్వాసాన్ని అమాంతం పెంచేసిందనడంలో సందేహం లేదు.
సాక్షి క్రీడా విభాగం
197 పరుగులు, 178 పరుగులు, 321 పరుగులు... న్యూజిలాండ్‌తో మూడు టెస్టుల్లో భారత్ గెలిచిన పరుగుల తేడా ఇది. తొలి టెస్టులో మొదటి రోజు కాస్త తడబడటం మినహా, ఎక్కడా మన జట్టు వెనుకంజ వేయలేదు. ముగ్గురు ఆటగాళ్లు గాయాలతో దూరమైనా, వారి స్థానంలో వచ్చినవారు తమ పాత్రను సమర్థంగా పోషించారు. ఫలితంగా ఆ ఆటగాళ్ల లోటు తెలియకపోగా, ఇక ముందు సుదీర్ఘ సీజన్‌లో ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నాయని కూడా తెలిసింది. ‘ఇది టీమ్ గేమ్. ఇక్కడ ఎలా ఆడాలో మా ఆటగాళ్లు సరిగ్గా అలాగే ఆడారు. గణాంకాల్లో చూస్తే కొందరి ప్రదర్శన చిన్నగా కనిపించవచ్చు. కానీ మ్యాచ్‌లను గెలిపించడంలో వాటి పాత్ర ఎంతో ముఖ్యమైంది. వ్యక్తిగత ప్రదర్శనకంటే ఈ సిరీస్ విజయాన్ని జట్టు విజయంగానే చూడాలి’ అని కెప్టెన్ కోహ్లి వ్యాఖ్యానించడం ఈ సిరీస్‌లో సమష్టితత్వాన్ని చూపిస్తోంది.
బౌలర్లు ముందుండి...
భారత జట్టు బౌలింగ్ ప్రదర్శనలో నిస్సందేహంగా అశ్విన్‌కు నూటికి నూరు మార్కులు పడతారుు. మూడు సార్లు ఇన్నింగ్‌సలో ఐదు వికెట్లు, రెండు సార్లు మ్యాచ్‌లో పది వికెట్ల ప్రదర్శన అసాధారణం. ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌కు ఊపిరి పీల్చుకునే అవకాశం ఇవ్వకుండా అతను చెలరేగాడు. మొత్తం 60 వికెట్లలో అతను తీసిన 27 సిరీస్‌ను శాసించారుు. అశ్విన్‌కు అండగా మరో ఎండ్‌లో జడేజా కూడా కివీస్‌ను తన కచ్చితత్వంతో తీవ్రంగా ఇబ్బంది పెట్టాడు. మొత్తం 14 వికెట్లు తీయడంతో పాటు రెండు సార్లు బ్యాటింగ్‌లోనూ కూడా ఆదుకున్నాడు. వీరిద్దరి నిలకడతో మూడో స్పిన్నర్‌ను ఆడించాల్సిన అవసరమే రాలేదు. కోల్‌కతా టెస్టులో భువనేశ్వర్ అద్భుత ప్రదర్శన (5/48) మరచిపోలేనిది. భారత్‌లో వికెట్‌పై కూడా ఒక పేసర్ మ్యాచ్ ఫలితాన్ని మార్చగలడని నిరూపించాడు. కెప్టెన్ తనపై ఉంచిన నమ్మకాన్ని కొంత వరకు షమీ నిలబెట్టాడు. వికెట్లపరంగా గొప్పగా కనిపించకపోరుునా... కీలక సమయంలో రివర్స్ స్వింగ్‌తో అతను సత్తా చాటాడు. పెద్దగా బౌలింగ్ చేసే అవకాశం రాకపోవడంతో ఉమేశ్ యాదవ్ మెరుపులు ఎక్కడా కనిపించలేదు. మొత్తంగా ప్రధాన బౌలర్లంతా తమ బాధ్యతను చక్కగా నిర్వర్తించడంతో బౌలింగ్ కోణంలో కొత్తగా ఆలోచించాల్సిన అవసరం లేకపోరుుంది.
పుజారా టాప్
ఈ సిరీస్‌కు ముందు పుజారా స్ట్రైక్‌రేట్‌పై చాలా చర్చ జరిగింది. వేగంగా ఆడమంటూ తాను సూచించానని కోహ్లి కూడా చెప్పాడు. అరుుతే ఇప్పుడు ఒకే దెబ్బతో పుజారా అన్నింటికీ సమాధానం ఇచ్చాడు. మూడు అర్ధ సెంచరీల తర్వాత సెంచరీతో అతను సిరీస్‌లో టాపర్ (373 పరుగులు)గా నిలిచాడు. ఇండోర్‌లో 147 బంతుల్లోనే చేసిన సెంచరీ ఆ మార్పును కూడా చూపించింది. నిలకడకు మారుపేరుగా మారిన రహానే (347) కూడా కీలక పాత్ర పోషించాడు. చివరి టెస్టులో చేసిన 188 పరుగులు అతని కెరీర్‌లో బెస్ట్‌గా చెప్పవచ్చు. సిరీస్ ఆరంభంలో తడబడినా డబుల్ సెంచరీ కోహ్లి విలువను మరోసారి చూపించింది. ఈ సిరీస్‌తో కెరీర్ నిలబెట్టుకున్న ఆటగాడు ఎవరైనా ఉన్నారంటే అది రోహిత్ శర్మనే. అనుక్షణం విమర్శలతో ఒత్తిడిలో నిలిచిన అతను మూడు మ్యాచుల్లోనూ కనీసం అర్ధసెంచరీ చేసి... కెప్టెన్, కోచ్ నమ్మకాన్ని నిలబెట్టాడు. కోల్‌కతా టెస్టులో రెండు అర్ధసెంచరీలతో సాహా ప్రధాన బ్యాట్స్‌మెన్‌గా ఎదిగాడు. ఓపెనర్‌గా విజయ్ ఆశించిన స్థారుులో రాణించకపోరుునా, సుదీర్ఘ సీజన్‌లో మంచి ఆరంభాలు ఇవ్వగల సామర్థ్యం అతనిలో ఉంది. గాయాలతో దూరమైన రాహుల్, ధావన్ ఆడిన ఏకై క టెస్టులో పెద్దగా ప్రభావం చూపలేదు. అరుుతే వీరి స్థానంలో వచ్చిన గంభీర్ అనుభవం మున్ముందు జట్టుకు మరింత ఉపయోగపడవచ్చు. రెండో ఇన్నింగ్‌సలో అతను చేసిన అర్ధసెంచరీ గంభీర్ రెండేళ్ల తర్వాత కూడా ఇంకా వెనుకబడిపోలేదని చూపించింది.
ముందుంది ఇంగ్లండ్...
కివీస్‌తో వన్డే సిరీస్ తర్వాత ఇంగ్లండ్ జట్టు మన గడ్డపై అడుగు పెడుతోంది. 2012లో ఆ టీమ్ 2-1తో సిరీస్ గెలిచింది. కివీస్ సులువుగానే తలవంచినా సాంప్రదాయ టెస్టుల్లో ఎలాంటి వేదికలోనైనా ఇంగ్లండ్ బలమైన జట్టే. నాడు సిరీస్ ఓడిన టీమ్ నుంచి ప్రస్తుత భారత జట్టులో ఆరుగురు ఆటగాళ్లు ఉన్నారు. నాడు పుజారా టాప్‌స్కోరర్‌గా నిలవగా... కోహ్లి, అశ్విన్ విఫలమయ్యారు. జడేజా, ఉమేశ్ ఒక్కో టెస్టు ఆడగా, గంభీర్ ఫర్వాలేదనిపించాడు. దాదాపు ప్రస్తుత జట్టే ఇంగ్లండ్‌తో కూడా తలపడే అవకాశం ఉంది. మరి మన టీమ్ ఇదే జోరును కొనసాగిస్తుందా చూడాలి.