పాక్ క్రికెట్‌లో పంచాయతీ
► ఆమిర్ రాకపై సీనియర్ల ఆగ్రహం
► క్యాంప్‌ను బహిష్కరించిన హఫీజ్, అజహర్
లాహోర్: పేస్ బౌలర్ మొహమ్మద్ ఆమిర్ పునరాగమనం పాకిస్తాన్ క్రికెట్‌లో చిచ్చు పెట్టింది. స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడి ఐదేళ్ల నిషేధం పూర్తి చేసుకున్న అనంతరం ఆమిర్ ఇటీవలే మళ్లీ పోటీ క్రికెట్ బరిలోకి దిగాడు. అయితే అతని రాకపై ఆల్‌రౌండర్ మొహమ్మద్ హఫీజ్, వన్డే జట్టు కెప్టెన్ అజహర్ అలీ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దాంతో వారిద్దరు పాక్ జట్టు జాతీయ శిబిరంకు తాము హాజరు కాలేమంటూ బహిష్కరించారు. న్యూజిలాండ్ సిరీస్ సన్నాహకాల్లో భాగంగా 26 మంది క్రికెటర్లతో పాక్ బోర్డు నిర్వహిస్తున్న ప్రత్యేక క్యాంప్‌కు ఆమిర్‌ను ఎంపిక చేశారు.
సోమవారం ప్రారంభమైన ఈ క్యాంప్‌కు దేశవాళీ క్రికెట్ కారణంగా తొలి మూడు రోజులు హఫీజ్, అజహర్ రాలేదు. గురువారం జట్టుతో చేరాల్సిన వీరిద్దరు డుమ్మా కొట్టినట్లు మేనేజర్ ఆగా అక్బర్ నిర్ధారించారు. అజహర్ అలీ నేరుగా కారణం చెప్పేయగా, హఫీజ్ ఏమీ చెప్పకుండానే తన నిరసన ప్రకటించాడు. ‘ఆమిర్ అక్కడ ఉన్నంత వరకు నేను శిబిరానికి హాజరు కాను. దీనిపై అవసరమైతే పీసీబీతో చర్చిస్తా. హఫీజ్ గురించి నేను మాట్లాడను కానీ బహుశా అతను కూడా ఇదే కారణంతో తప్పుకొని ఉండవచ్చు’ అని అజహర్ స్పష్టం చేశాడు.