ఎవరైనా ఇద్దరికి ఒకేరోజున బర్త్‌డే వస్తే.. భలే కదా అనిపిస్తుంది. అదే ముగ్గురు, నలుగురి పుట్టినరోజు ఒకే రోజున ఉంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. మరి ఒకే కుటుంబంలో అందరి బర్త్‌డే ఒకే రోజున అయితే.. అదీ ఒకరిద్దరు కాదు ఏకంగా తొమ్మిది మంది పుట్టినది ఒకే తేదీన అయితే.. గిన్నిస్ వరల్డ్ రికార్డు సొంతం అవుతుంది. మరి అలాంటి ఓ ‘రికార్డు’ ఫ్యామిలీ గురించి తెలుసా?
పుట్టినరోజు పెళ్లి చేసుకుని..
పాకిస్తాన్‌లోని లర్కానా ప్రాంతానికి చెందిన మంగి అమీర్ అలీ, ఆయన భార్య ఖుదీజా.. ఇద్దరి పుట్టిన రోజు ఆగస్టు ఒకటో తేదీనే. దీంతో వారు 1991లో ఆగస్టు ఒకటో తేదీనే పెళ్లి చేసుకున్నారు. సరిగ్గా ఏడాదికి ఆగస్టు ఒకటినే వారికి పాప పుట్టింది. తమ పుట్టినరోజునే పాప పుట్టడంపై అమీర్, ఖుదీజా ఆశ్చర్యపోయినా.. సంబురంగా ఆమెకు సింధు అని పేరుపెట్టుకున్నారు.
కొన్నేళ్లకు సాసూ, సప్నా అనే కవల అమ్మాయిలు.. తర్వాత విడివిడిగా అమీర్, అంబర్ అనే ఇద్దరు అబ్బాయిలు.. ఆ తర్వాత అమర్, అహ్మర్ అనే కవల అబ్బాయిలు పుట్టారు. వీరంతా పుట్టినది ఆగస్టు ఒకటో తేదీనే కావడం విశేషం. అంతేకాదు.. ఏదో సిజేరియన్ ఆపరేషన్లతో ఇలా ఒకేరోజు పుట్టారనడానికీ లేదు. అంతా సహజ ప్రసవాలేనట.
గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ ప్రతినిధులు ఈ కుటుంబం సర్టిఫికెట్లు, ప్రభుత్వ రికార్డులు అన్నీ పరిశీలించేసి.. వీరిని గిన్నిస్‌బుక్ లోకి ఎక్కించేశారు. ‘‘ఇలా ఒకే తేదీన అందరూ జన్మించడం మాకు భగవంతుడు ఇచ్చిన బహుమతి. ఏటా అందరం కలసి ఒకే కేక్ కట్ చేస్తాం. ఒకరికొకరు అందరం శుభాకాంక్షలు చెప్పుకొంటాం..’’ అని అమీర్ పేర్కొన్నాడు.
ఇంతకుముందు అమెరికాలో..
ఒకే కుటుంబానికి చెందిన ఎక్కువ మంది బర్త్‌డే ఒకే రోజు ఉన్న రికార్డు ఇంతకుముందు అమెరికాకు చెందిన కమ్మిన్స్ కుటుంబం పేరిట నమోదైఉంది. 1952–66 మధ్య అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు కలిపి ఐదుగురు ఫిబ్రవరి 20వ తేదీనే పుట్టారు. ఇప్పటివరకు కూడా అదే రికార్డుగా నిలవగా.. అమీర్ అలీ కుటుంబం దాన్ని బద్దలు కొట్టింది.
రెండు కవల జంటల రికార్డు కూడా..
అమీర్ కుటుంబంలో సాసూ–సప్నా కవలలు, అమర్–అహ్మర్ కవలలు అంతా ఒకే తేదీన జన్మిం చారు. ఇలా ఒకే తల్లికి ఒకే తేదీన రెండు సార్లు కవలలు పుట్టడం కూడా విశేషమే. ఇంతకుముందు ప్రపంచవ్యాప్తంగా నాలుగు సార్లు మాత్రమే ఇలాంటి జననాలు నమోదవడం గమనార్హం.
– సాక్షి, సెంట్రల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment