
కశ్యప్‌పై ప్రణయ్ పైచేయి
యూఎస్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీ టైటిల్ సొంతం
కాలిఫోర్నియా: భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ ప్లేయర్ హెచ్‌ఎస్ ప్రణయ్ తన కెరీర్‌లో నాలుగో అంతర్జాతీయ సింగిల్స్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. యూఎస్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నమెంట్‌లో ప్రణయ్ చాంపియన్‌గా నిలిచాడు. తన సహచరుడు పారుపల్లి కశ్యప్‌తో జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రణయ్ 21–15, 20–22, 21–12తో విజయం సాధించాడు. గతంలో ప్రణయ్ వియత్నాం ఓపెన్ గ్రాండ్‌ప్రి, ఇండోనేసియా మాస్టర్స్ గ్రాండ్‌ప్రి గోల్డ్ (2014లో), స్విస్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ (2016లో) టోర్నీలలో టైటిల్స్ సాధించాడు. రెండేళ్ల విరామం తర్వాత ఓ అంతర్జాతీయ టోర్నీలో ఫైనల్ ఆడిన 30 ఏళ్ల కశ్యప్ 65 నిమిషాలపాటు పోరాడినా తనకంటే మెరుగైన ఫిట్‌నెస్ ఉన్న ప్రణయ్ ధాటికి ఎదురు నిలువలేకపోయాడు.
హైదరాబాద్‌లోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో శిక్షణ పొందుతున్న ఈ ఇద్దరూ మూడేళ్ల తర్వాత ముఖాముఖిగా తలపడ్డారు. తొలి గేమ్‌లో కశ్యప్ 7–1తో ముందంజ వేసినా ఆ తర్వాత ప్రణయ్ దూకుడుకు వెనుకబడ్డాడు. స్కోరును 15–15 వద్ద సమం చేసిన ప్రణయ్ ఈ దశలో వరుసగా ఆరు పాయింట్లు గెలిచి తొలి గేమ్‌ను దక్కించుకున్నాడు. రెండో గేమ్‌లో కశ్యప్ తేరుకొని మళ్లీ ఆధిక్యంలోకి వెళ్లాడు. ఒకదశలో స్కోరు 15–15తో సమంగా నిలిచినా... కశ్యప్ నిలకడగా పాయింట్లు గెలిచి 20–18తో పైచేయి సాధించాడు. ప్రణయ్ రెండు పాయింట్లు గెలిచి స్కోరును సమం చేసినా... కశ్యప్ మళ్లీ రెండు పాయింట్లు సాధించి రెండో గేమ్‌ను దక్కించుకున్నాడు.
ఇక నిర్ణాయక మూడో గేమ్‌లో 24 ఏళ్ల ప్రణయ్ ఆరంభం నుంచే జోరు కనబరిచాడు. 13–7తో ఆధిక్యంలోకి వెళ్లిన ఈ కేరళ ఆటగాడు ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. విజేతగా నిలిచిన ప్రణయ్‌కు 9,000 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 5 లక్షల 79 వేలు)తోపాటు 7,000 ర్యాంకింగ్ పాయింట్లు... రన్నరప్ కశ్యప్‌కు 4,560 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 2 లక్షల 93 వేలు)తోపాటు 5,950 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.