సీనియర్ విభాగంలోనూ రాణిస్తా!
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ యూత్, జూనియర్ స్థాయిలో సాధించిన విజయాలు సంతృప్తినిచ్చాయని, ఇకపై సీనియర్ విభాగంలోనూ రాణించేందుకు కృషి చేస్తానని ఆంధ్రప్రదేశ్ వెయిట్ లిఫ్టర్ రాగాల వెంకట రాహుల్ అన్నాడు. ఏపీ స్పోర్ట్స్ స్కూల్‌లో ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం చదువుతున్న 17 ఏళ్ల రాహుల్, ఇటీవల పలు అంతర్జాతీయ టోర్నీల్లో సత్తా చాటాడు.
గత రెండు నెలల కాలంలో ఆసియా యూత్ గేమ్స్, ఆసియా చాంపియన్‌షిప్, ఆసియా ఇంటర్ క్లబ్‌లో 1 స్వర్ణం, 2 రజతాలు, 2 కాంస్యాలు నెగ్గాడు. అంతర్జాతీయ స్థాయి సీనియర్ విభాగంలో రాణించేందుకు స్నాచ్, క్లీన్ అండ్ జర్క్ విభాగాల్లో కనీసం మరో 5 కిలోలు అదనంగా బరువు ఎత్తాల్సి ఉంటుందని, అందుకోసం తీవ్రంగా శ్రమిస్తున్నానని రాహుల్ చెప్పాడు. తాను పాల్గొనే అన్ని టోర్నీలలో 77 కేజీల విభాగంలో అతను పోటీ పడుతున్నాడు. 2014 కామన్వెల్త్ క్రీడల్లో పతకమే లక్ష్యంగా పాటియాలలోని ఎన్‌ఐఎస్‌లో రాహుల్ శిక్షణ పొందుతున్నాడు. ‘ప్రస్తుతం నేను స్నాచ్‌లో 145 కిలోలు, క్లీన్ అండ్ జర్క్‌లో 175 కిలోల వరకు బరువు ఎత్తగలుగుతున్నాను. మరో 5 కిలోలు కలిపి 150, 180 చేస్తే సీనియర్‌లోనూ నేను పతకం గెలుచుకునే అవకాశం ఉంది. 2010 ఢిల్లీ కామన్వెల్త్‌లో కాంస్య పతక విజేత ప్రదర్శనకంటే కూడా ఇది మెరుగైన ప్రదర్శన’ అని అతను వివరించాడు.
‘శాప్’ ఎండీ అభినందన
వెయిట్‌లిఫ్టింగ్‌లో వరుస విజయాలు సాధిస్తున్న ఏపీ ఆటగాడు ఆర్‌వీ రాహుల్‌ను మంగళవారం ఏపీ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) మేనేజింగ్ డెరైక్టర్ రాహుల్ బొజ్జా అభినందించారు. అతను భవిష్యత్తులో మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా రాహుల్‌తో పాటు అతని తల్లిదండ్రులు, ఏపీ వెయిట్ లిఫ్టింగ్ సంఘం కార్యదర్శి వెంకట్రామయ్య, ఏపీ స్పోర్ట్స్ స్కూల్ ప్రత్యేక అధికారి నర్సయ్య, కోచ్‌లు మాణిక్యాల రావు, సింగ్ కూడా ఉన్నారు.