
బెంగళూరు: విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా హైదరాబాద్‌తో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్... 282 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆంధ్ర స్కోరు 36.3 ఓవర్లు ముగిసేసరికి 198/2... అప్పటికే హనుమ విహారి (99 బంతుల్లో 95; 8 ఫోర్లు, 4 సిక్సర్లు), రికీ భుయ్ (71 బంతుల్లో 52; 5 ఫోర్లు, 1 సిక్స్) నాలుగో వికెట్‌కు 112 పరుగులు జోడించి జోరు మీదుండటంతో ఆంధ్ర గెలుపు దిశగా సాగుతోంది. ఈ స్థితిలో హైదరాబాద్ పేసర్ మొహమ్మద్ సిరాజ్ (3/50) ప్రత్యర్థిని దెబ్బ తీశాడు. తన వరుస ఓవర్లలో భుయ్, విహారిలను ఔట్ చేసి ఆంధ్ర ఆశలపై నీళ్లు చల్లాడు. చివరకు 14 పరుగుల తేడాతో గెలిచిన హైదరాబాద్ సెమీఫైనల్లోకి ప్రవేశించగా, ఆంధ్ర నిష్క్రమించింది. ముందుగా హైదరాబాద్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 281 పరుగులు చేసింది.
‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ బావనక సందీప్ (97 బంతుల్లో 96; 7 ఫోర్లు, 1 సిక్స్) త్రుటిలో సెంచరీ చేజార్చుకోగా, తన్మయ్ అగర్వాల్ (31; 2 ఫోర్లు, సిక్స్), కెప్టెన్ అంబటి రాయుడు (28; ఫోర్, సిక్స్), సుమంత్ (27; 2 ఫోర్లు, సిక్స్), సీవీ మిలింద్ (7 బంతుల్లో 15; 2 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించారు. ఆంధ్ర బౌలర్లలో అయ్యప్ప, గిరినాథ్ రెడ్డి, పృథ్వీరాజ్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం ఆంధ్ర 50 ఓవర్లలో 9 వికెట్లకు 267 పరుగులే చేయగలిగింది. కెప్టెన్ హనుమ విహారి శతకం కోల్పోగా, అశ్విన్ హెబర్ (38) రాణించాడు. రేపు జరిగే తొలి సెమీఫైనల్లో ముంబైతో హైదరాబాద్, గురువారం జరిగే రెండో సెమీస్‌లో ఢిల్లీతో జార్ఖండ్ ఆడతాయి.
Comments
Please login to add a commentAdd a comment