బీసీసీఐపై యువీ, భజ్జీ అసంతృప్తి | Vijay Hazare Trophy: Yuvraj And Harbhajan Questions BCCI Sick Rule | Sakshi
Sakshi News home page

బీసీసీఐపై యువీ, భజ్జీ అసంతృప్తి

Published Tue, Oct 22 2019 7:50 PM | Last Updated on Tue, Oct 22 2019 7:50 PM

Vijay Hazare Trophy: Yuvraj And Harbhajan Questions BCCI Sick Rule - Sakshi

బెంగళూరు: విజయ్‌ హజారే ట్రోఫీలో భాగంగా పంజాబ్‌- తమిళనాడు జట్ల మధ్య జరిగిన క్వార్టర్స్‌ ఫైనల్స్‌ మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దయింది. అయితే నిబంధనల ప్రకారం లీగ్‌లో అత్యధిక విజయాలు నమోదు చేసిన తమిళనాడు సెమీస్‌కు చేరింది. దీంతో పంజాబ్‌ సెమీస్‌ ఆశలకు గండిపడింది. అయితే సెమీస్‌ స్థానం కోసం జరిగే కీలక మ్యాచ్‌కు రిజర్వ్‌డే కేటాయించకపోవడంపై టీమిండియా సీనియర్‌ క్రికెటర్లు హర్భజన్‌ సింగ్‌, యువరాజ్‌ సింగ్‌లు బీసీసీఐని తప్పుబట్టారు. 

‘ఇదొక చెత్త నిబంధన. ఇలాంటి టోర్నీలలో కీలక మ్యాచ్‌లకు రిజర్వ్‌డేను ఎందుకు కేటాయించకూడదు. బీసీసీఐ తన నిబంధలనపై ఓ సారి పునరాలోచించుకోవాలి’ అని భజ్జీ సూచించాడు. ‘విజయ్‌హజారే ట్రోఫీలో తమిళనాడుతో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ను మరోసారి దురదృష్టం వెంటాడింది. రిజర్వ్‌డే లేని కారణంగా పంజాబ్‌ సెమీస్‌కు వెళ్లలేదు. ఎందుకు రిజర్వ్‌డే కేటాయించలేదో అర్థం కావడం లేదు? దేశవాళీ టోర్నీ అని రిజర్వ్‌డే ఆడించలేదా?’అంటూ బీసీసీఐని యువీ ప్రశ్నించాడు. 

ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన తమిళనాడు 39 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసిన సమయంలో వాన కురవడంతో మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడింది. దీంతో వీజేడీ పద్ధతి ద్వారా పంజాబ్‌ లక్ష్యాన్ని 195 పరుగులుగా నిర్ణయించారు. లక్ష్యఛేదనలో పంజాబ్‌ 12.2 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 52 పరుగులు చేసిన సమయంలో మరోమారు వర్షం రావడంతో ఆట సాధ్యపడలేదు. దీంతో మ్యాచ్‌ను రద్దుచేశారు. అయితే లీగ్‌లో తమిళనాడు(9) పంజాబ్‌(5) కంటే అత్యధిక విజయాలు నమోదు చేయడంతో సెమీస్‌కు చేరింది. ఇక ముంబై, ఛత్తీస్‌గఢ్‌ మధ్య జరగాల్సిన మరో క్వార్టర్స్‌ మ్యాచ్‌కూడా వర్షం కారణంగా రద్దయింది. దీంతో లీగ్‌లో అత్యధిక విజయాలు నమోదు చేసిన ఛత్తీస్‌గడ్‌ సెమీస్‌కు చేరింది. ఇలా రెండు ప్రధాన జట్లు వర్షం కారణంగా టోర్నీ నుంచి నిష్క్రమించడం, రిజర్వ్‌డే లేకపోవడం పట్ల క్రికెట్‌ విశ్లేషకులు, అభిమానులు పెదవి విరుస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement