మా వరల్డ్‌కప్‌ ప్రణాళికల్లో ఆ ముగ్గురు..: ఎంఎస్‌కే | Vijay Shankar in World Cup plans, says chief selector, MSK | Sakshi
Sakshi News home page

మా వరల్డ్‌కప్‌ ప్రణాళికల్లో ఆ ముగ్గురు..: ఎంఎస్‌కే

Published Mon, Feb 11 2019 1:03 PM | Last Updated on Wed, May 29 2019 2:38 PM

Vijay Shankar in World Cup plans, says chief selector, MSK  - Sakshi

ముంబై: మరో మూడు నెలల్లో ఇంగ్లండ్‌ వేదికగా జరుగనున్న వన్డే వరల్డ్‌కప్‌కు భారత క్రికెట్‌ జట్టు తమ కసరత్తులు ముమ్మరం చేసింది. ఒకవైపు యువ ఆటగాళ్లను పరీక్షిస్తూనే వారి బ్యాటింగ్‌ ఆర్డర్‌పై కూడా ఒక కన్నేసి ఉంచింది. దీనిలో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను ప్రయోగాత్మకంగా పరిశీలించింది. ఈ సిరీస్‌లో విజయ్‌ శంకర్‌ బ్యాటింగ్‌లో భారీ షాట్లు ఆడి తాను కూడా వరల్డ్‌కప్‌ రేసులో ఉన్నాననే సంకేతాలు పంపాడు. తాజాగా విజయ్‌ శంకర్‌ స్థానంపై టీమిండియా చీఫ్‌ సెలక్టర్‌ ఎంఎస్‌కే ప‍్రసాద్‌ సూత్రప్రాయంగా స్పష్టత ఇచ్చాడు.  ఆ మెగా టోర్నీలో భాగంగా విజయ్‌ శంకర్‌ కూడా తన ప్రణాళికల్లో ఉన్నాడంటూ పేర్కొన్నాడు. విజయ్‌తో పాటు రిషభ్‌ పంత్‌, అజింక్యా రహానేలు కూడా వరల్డ్‌కప్‌కు వెళ్లే భారత జట్టు ప్రాబబుల్స్‌ కోసం పరిశీలనలో ఉన్నట్లు తెలిపాడు. ఏప్రిల్‌ 23వ తేదీ జట్లు ఎంపికకు చివరి తేదీ కాగా, ఈలోపు పూర్తిస్థాయి జాబితాను సిద్ధం చేసేందుకు టీమిండియా మేనేజ్‌మెంట్‌ తర్జన భర్జన పడుతోంది.

దీనిలో భాగంగా మీడియాతో మాట్లాడిన ఎంఎస్‌కే ప్రసాద్‌.. విజయ్‌ శంకర్‌, రిషభ్‌ పంత్‌, అజింక్యా రహానేలు వరల్డ్‌కప్‌ రేసులో ఉన్నట్లు తెలిపాడు. ఇప‍్పటికే రిషభ్‌ పంత్‌ తానేంటో నిరూపించుకోగా, తాజాగా విజయ్‌ శంకర్‌పై మేనేజ్‌మెంట్‌ ఒక స్పష్టతకు వచ్చినట్లు పేర్కొన్నాడు. గత రెండేళ్ల నుంచి భారత్‌-ఎ తరఫున విజయ్‌ శంకర్‌ నిలకడగా ఆడుతున్న విషయాన్ని కూడా ఎంఎస్‌కే ఈ సందర్భంగా తెలిపాడు. ఇక దేశవాళీ క్రికెట్‌లో విశేషంగా రాణిస్తున్న రహానే వరల్డ్‌కప్‌ ఎంపిక రేసులో ముందువరుసలో ఉన్నాడన్నాడు. ఈ క్రమంలోనే వరల్డ్‌కప్‌లో మూడో ఓపెనర్‌గా రహానేను పరిశీలించాలని అనుకుంటున్నట్లు తెలిపాడు. ఇటీవల లిస్ట్‌-ఎ క్రికెట్‌లో రహానే తన మార్కు ఆట తీరును చూపించాడు. 11 ఇన్నింగ్స్‌ల్లో 74.62 సగటుతో 597 పరుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు, మూడు హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement