
విరాట్ కోహ్లి, అనుష్క శర్మ
కొలంబో: విరాట్ కోహ్లి, అనుష్క శర్మ... అందరినీ ఆకర్షించిన ‘ఫైవ్‌స్టార్’ సెలబ్రిటీ జోడీ. వారి ప్రేమ నుంచి పెళ్లి దాకా... పుకార్లు, షికార్లు అన్నీ ఇన్నీ కావు. ఏదేమైనా ఓ షాంపూ యాడ్‌తో ఒక్కటైన ఈ జోడీ గతేడాది ఇటలీలో ఏడడుగులు వేసింది. తమ పెళ్లి పుస్తకంలోని తొలి పేజీ ‘హనీమూన్’ను స్విట్జర్లాండ్‌లో జరుపుకుంది. కోహ్లి ఏ మాత్రం తీరిక దొరికినా తన ప్రియసఖితో గడిపేందుకే సమయం కేటాయిస్తున్నాడు. ప్రస్తుతం శ్రీలంకలో జరుగుతున్న ముక్కోణపు టి20 సిరీస్ నుంచి కోహ్లి తప్పుకున్నాడు.
ఇది సింహళ దేశంలోని కోహ్లి అభిమానులను బహుశా బాధించిందేమో! దీంతో ఆటలోని లోటును విహారంతో భర్తీ చేయాలని సాక్షాత్తూ ఆ దేశ క్రీడల మంత్రే స్వయంగా ఆహ్వానించారు. తమ దేశ అతిథిగా తమ ద్వీపంలో గడపాలని మంత్రి దయసిరి జయశేఖర ఆహ్వానం పలికారు. ‘కోహ్లిని ఆడేందుకు పిలవట్లేదు. వివాహం తర్వాత ఇక్కడ పర్యటించని కోహ్లి తన సతీమణి అనుష్క శర్మతో కలిసి విహరించాలని ఆహ్వానిస్తున్నా. లంక ద్వీపంలో ఎన్నో అద్భుతమైన ప్రదేశాలున్నాయి. వాటిని చూస్తూ సేదతీరొచ్చు’ అని జయశేఖర పేర్కొనట్లు ఓ మీడియా సంస్థ తెలిపింది.
ప్రస్తుతం విరుష్క జంట ముంబైలోని ఓ విలాసవంతమైన అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌లో కాపురం పెట్టింది. దీని అద్దె నెలకు రూ. 15 లక్షలు. రెండేళ్లు ఉండే విధంగా అగ్రిమెంట్ చేసుకొని రూ. కోటి 50 లక్షలు చెల్లించినట్లు సమాచారం. అయితే ఆటతో పాటు బ్రాండింగ్‌తో కోట్లకు పడగలెత్తిన కోహ్లికి కిరాయి ఇంట్లో ఉండే ఖర్మేమిటనే సందేహం కలుగక మానదు. నిజమే! కానీ అతను 2016లోనే ముంబైలోని ఖరీదైన ప్రాంతం వర్లీలో ఓ ఫ్లాట్ కొన్నాడు. 7 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ఫ్లాట్ ఇంకా పూర్తి స్థాయిలో సిద్ధం కాకపోవడంతో ప్రస్తుతానికి అద్దె ఇంట్లో ఉంటోంది ఈ జంట.
Comments
Please login to add a commentAdd a comment