
'బౌలింగ్ కోచ్ ను నియమించండి'
న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టుకు బౌలింగ్ కోచ్ కావాలంటున్నారు ప్రధాన కోచ్ అనిల్ కుంబ్లే, కెప్టెన్ విరాట్ కోహ్లిలు. ఇటీవల కాలంలో టీమిండియా పేసర్లు ఆశించిన స్థాయిలో రాణిస్తుండటంతో వారికి మరింత పదును పెడితే బాగుంటుందనేది వీరి ఆలోచన. దానిలో భాగంగా బౌలింగ్ కోచ్ ఏర్పాటు చేస్తే బాగుంటదని బీసీసీఐ నిర్వాహకుల కమిటీ(సీఓఏ)కి విజ్ఞప్తి చేశారు.
గతేడాది జూన్లో టీమిండియా ప్రధాన కోచ్ గా కుంబ్లేను నియమించిన సంగతి తెలిసిందే. టీమిండియా డైరక్టర్ గా పని చేసిన రవిశాస్త్రిని తొలగించి అతని స్థానంలో కుంబ్లేను నియమించారు. ఆ పదవికి రవిశాస్త్రి పోటీపడ్డప్పటికీ అతనికి నిరాశే ఎదురైంది. అయితే బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ స్థానంలో ఎవర్నీ నియమించలేదు. ఆ క్రమంలోనే భారత్ బౌలింగ్ కోచ్ ప్రతిపాదన మరొకసారి తెరపైకి వచ్చింది. ఇదిలా ఉంచితే టీమిండియా మాజీ బౌలర్ జహీర్ ఖాన్ ను బౌలింగ్ కోచ్ నియమించాలని హర్భజన్ సింగ్ కోరుతున్నాడు.