
అతడి పనిమనిషి కార్లను కడిగేందుకు మంచినీటిని ఉపయోగిస్తున్నాడంటూ స్థానికులు ఫిర్యాదు చేశారు.
న్యూఢిల్లీ : పనిమనిషి నిర్వాకం కారణంగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ గురుగ్రామ్(ఎమ్‌సీజీ) జరిమానా విధించింది. తాగునీటితో కారును కడిగి.. వేలాది లీటర్ల నీటిని వృథా చేసినందుకు గానూ రూ. 500 చెల్లించాలని ఆదేశించింది. గురుగ్రామ్‌లోని డీఎల్‌ఎఫ్ ఫేస్-1లో ఉన్న కోహ్లి నివాసంలో సుమారు ఆరు కార్లు ఉన్నాయి. ఈ క్రమంలో అతడి పనిమనిషి కార్లను కడిగేందుకు మంచినీటిని ఉపయోగిస్తున్నాడంటూ స్థానికులు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన ఎమ్‌సీజీ అధికారులు కోహ్లికి జరిమానా విధించారు.
కాగా ప్రస్తుతం దేశంలోని పలు ప్రాంతాల్లో నీటి కొరత ఉన్న సంగతి తెలిసిందే. కొన్ని ప్రాంతాల్లో అయితే తాగేందుకు కూడా నీళ్లు దొరకడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో కొంతమంది సంపన్నుల ఇళ్లల్లో మాత్రం వేలాది గ్యాలన్ల కొద్దీ నీళ్లు వృథా అవుతున్నాయి. గురుగ్రామ్‌లో కూడా ఇటువంటి పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో తాగునీటిని పొదుపు వాడుకోవాల్సిందిగా ఎమ్‌సీజీ విఙ్ఞప్తి చేసింది. అయినప్పటికీ వారిలో మార్పు రాకపోవడంతో కోహ్లితో పాటు మరికొంత మందికి కూడా జరిమానా విధించింది. ఇక ప్రపంచకప్-2019 నిమిత్తం విరాట్ కోహ్లి ప్రస్తుతం ఇంగ్లండ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సౌతాఫ్రికాతో జరిగిన తొలి మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో గెలుపొంది.. కోహ్లి సేన మెగా టోర్నీని ఘనంగా ఆరంభించింది.