టీమిండియానే ఫేవరెట్
కరీబియన్ గడ్డపై వరుసగా మూడో సిరీస్ నెగ్గాలని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ భావిస్తుండగా, ఎంత కష్టమైనా సరే మెరుగైన ప్రదర్శన ఇస్తామని వెస్టిండీస్ కెప్టెన్ జాసన్ హోల్డర్ అంటున్నాడు. గతేడాది శ్రీలంక, దక్షిణాఫ్రికాలపై సిరీస్‌లు గెలిచిన టీమిండియా ఈ సిరీస్ నెగ్గితే కోహ్లీకి హ్యాట్రిక్ సిరీస్. వెస్టిండీస్ పై భారత్కు వరుసగా మూడో సిరీస్ విజయం అవుతుంది. నేటి(గురువారం) నుంచి నాలుగు టెస్టుల సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో విండీస్ కెప్టెన్ హోల్డర్ కాస్త ఆందోళనలో ఉన్నట్లు కనిపిస్తున్నాడు.
గతంలో రెండు, మూడు మ్యాచ్ సిరీస్లు ఆడాను, కానీ నాలుగు టెస్టుల సిరీస్ ఇదే తనకు తొలిసారి అని హోల్డర్ పేర్కొన్నాడు. తమ జట్టులో ఎక్కువగా అనుభవంలేని ఆటగాళ్లు ఉన్నారని ఈ ఏడాది ఆస్ట్రేలియాతో సిరీస్ ఓటమికి కారణమని వెల్లడించాడు. ఆసీస్ సిరీస్ నుంచి కొన్ని పాఠాలను నేర్చుకున్నాం, అయితే ఇంకా రాణించాల్సిన అవసరం ఉందన్నాడు. ఇక్కడి పిచ్లు చాలా మందకొడిగా ఉంటాయని, వీటిపై రాణించాలంటే మరింత శ్రమించాల్సి ఉంటుందన్నాడు. బౌలింగ్, బ్యాటింగ్ ఇలా ఏ విభాగంలో చూసినా టీమిండియానే మెరుగ్గా కనిపిస్తోంది.