'మంచి ఆటగాళ్లను ఎంపిక చేస్తాం'
తిరుమల: టీమిండియా సెలెక్టర్ గా ఎంపిక చాలా ఆనందంగా ఉందని మాజీ వికెట్ కీపర్ మన్నవ శ్రీకాంత్ (ఎమ్మెస్కే) ప్రసాద్ అన్నారు. భారత జట్టుకు మంచి ఆటగాళ్లను ఎంపిక చేసేందుకు తన అనుభవాన్ని వినియోగిస్తానని చెప్పారు. తనకు సీనియర్ సెలక్షన్ కమిటీలో చోటు దక్కడంతో రెండు తెలుగు రాష్ట్రాల ఆటగాళ్లకు జాతీయ జట్టులో ఆడేందుకు అవకాశాలు మెరుగవుతాయన్న ఆశాభావం వ్యక్తం చేశాడు.
తెలుగు రాష్ట్రాల నుంచి మరింత మంది జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తారని ఆశిస్తున్నట్టు చెప్పారు. రాబోయే 10 ఏళ్లను దృష్టిలో పెట్టుకుని ఆటగాళ్లను ఎంపిక చేస్తామన్నారు. భారత ఆటగాళ్లు అన్ని పిచ్ లపై ఆడేవిధంగా ఆటతీరు మలుచుకోవాలని సూచించాడు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా భారత్ లో 30 ఫస్ట్ క్లాస్ జట్లు ఉన్నాయని వెల్లడించారు.