ఇంగ్లాండ్ 88 ఆలౌట్, నెదర్లాండ్ సంచలన విజయం!
టీ20 ప్రపంచకప్ మ్యాచ్ లో ఇంగ్లాడ్ జట్టుకు నెదర్లాండ్ జట్టు గట్టి షాక్ ఇచ్చింది. జాహుర్ ఆహ్మద్ చౌదరీ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో ఇంగ్లాండ్ పై నెదర్లాండ్ జట్టు 45 పరుగుల తేడాతో సంచలన విజయం నమోదు చేసింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో బ్యాటింగ్ దిగిన నెదర్లాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 133 పరుగులు చేసింది. నెదర్లాండ్ జట్టులో అత్యధికంగా బారేసి 48, మైబర్గ్ 39 పరుగులు చేశాడు. ఇంగ్లాండ్ జట్టులో బ్రాడ్ కు 3 వికెట్లు, జోర్డాన్, బొపారాకు చెరో వికెట్ దక్కాయి.
ఆతర్వాత 134 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ దిగిన ఇంగ్లాండ్ జట్టు 88 పరుగులకే కుప్పకూలింది. నెదర్లాండ్ జట్టు బౌలర్లు ముదస్సర్ బుఖారీ, వాన్ బీక్ రాణించి మూడేసి వికెట్లు పడగొట్టారు. గుగ్టెన్, బోరెన్ చెరో వికెట్ పడగొట్టారు. ఇంగ్లాండ్ జట్టులో హేల్స్ (12), బొపారా(18), జోర్డాన్ (14) మాత్రమే రెండెంకెల స్కోరును నమోదు చేసుకున్నారు. మిగితావారందరూ సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. నెదర్లాండ్ విజయంలో కీలకపాత్ర పోషించిన బుఖారీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది.