
వృద్ధిమాన్ సాహా అరుదైన ఘనత
న్యూఢిల్లీ:మహేంద్రసింగ్ ధోని టెస్టు క్రికెట్ నుంచి విరామం తీసుకున్న తరువాత అతని వారుసుడిగా మన్ననలు అందుకుంటున్న యువ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. తాజాగా కోల్ కతా నగరంలో ఈడెన్ గార్డెన్లో న్యూజిలాండ్ తో జరుగుతున్న రెండో టెస్టు రెండు ఇన్నింగ్స్ల్లో హాఫ్ సెంచరీలు సాధించి అజేయంగా నిలిచాడు. తద్వారా భారత టెస్టు క్రికెట్ చరిత్రలో ఒక మ్యాచ్ రెండు ఇన్నింగ్స్ ల్లోనూ అర్థ శతకాలు సాధించిన నాల్గో వికెట్ కీపర్ గా గుర్తింపు సాధించాడు. ఈ మ్యాచ్లో సాహా(54 నాటౌట్, 58 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించాడు.
అయితే అంతకుముందు ఈ ఘనతను అందుకున్న భారత వికెట్ కీపర్లలో మహేంద్ర సింగ్ ధోని, దిల్వార్ హుస్సేన్, ఫరూఖ్ ఇంజనీర్లు ఉన్నారు. కాగా, ఈ ఫీట్ ను ధోని నాలుగు సార్లు సాధించడం విశేషం. 2008లో మొహాలిలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో ధోని తొలిసారి ఈ ఘనతను సాధిచాడు. ఆ తరువాత అదే సిరీస్ లో నాగ్ పూర్ లో జరిగిన టెస్టులో కూడా ధోని రెండు వరుస హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు.
ఆపై 2009లో న్యూజిలాండ్ తో టెస్టు మ్యాచ్ లో, 2011లో బర్మింగ్ హమ్లో ఇంగ్లండ్ తో జరిగిన టెస్టులో ఈ ఘనతను సాధించాడు. దాదాపు ఐదు సంవత్సరాల తరువాత ఒక భారత వికెట్ కీపర్ ఒక మ్యాచ్ లో రెండు హాఫ్ సెంచరీలు సాధించడం ఇదే ప్రథమం. గత ఏడు టెస్టు ఇన్నింగ్స్ ల్లో సాహా (40, 47, 104, 14,0, 54 నాటౌట్, 58 నాటౌట్లు) కేవలం రెండు ఇన్నింగ్స్ ల్లోనే విఫలం కావడం అతని ప్రతిభకు అద్ధం పడుతోంది.