
యోగేశ్వర్ సాధిస్తాడా?
రియో ఒలింపిక్స్లో భారత్కు మరో పతకం వచ్చే అవకాశం రెజ్లర్ యోగేశ్వర్ దత్పైనే ఆధారపడి వుంది. గత లండన్ ఒలింపిక్స్లో కాంస్య పతకాన్ని సాధించిన యోగేశ్వర్పై భారత అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. భారతకాలమాన ప్రకారం ఆదివారం సాయంత్రం జరుగనున్న 65 కేజీల ఫ్రీ స్టయిల్ రెజ్లింగ్లో యోగేశ్వర్ బరిలోకి దిగనున్నాడు. హరియాణాకు చెందిన యోగేశ్వర్ రెజ్లింగ్లో మరో పతకాన్ని సాధిస్తాడనేది విశ్లేషకుల అంచనా. అయితే ఎన్నో ఆశలతో రియోకు వెళ్లిన మరో రెజ్లర్ నర్సింగ్ యాదవ్ పోరుకు సిద్ధం కాకుండానే వెనుదిరగాల్సి వచ్చింది. గతంలో అతనిపై వచ్చిన డోపింగ్ ఆరోపణలతో ఒలింపిక్స్ కు దూరం కావాల్సి వచ్చింది.
నర్సింగ్ యాదవ్కు వ్యతిరేకంగా కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (సీఏఎస్) తీర్పు రావడంతో యోగేశ్వర్పై ప్రభావం చూపే అవకాశం ఉందని ఒక వాదనగా వినబడుతోంది. అయితే గేమ్స్లో ఈ తరహా ఘటనలు సహజం కావడంతో యోగేశ్వర్ ఎటువంటి ఒత్తిడి లేకుండానే బరిలోకి దిగే అవకాశం ఉంది. ఇప్పటికే రెజ్లింగ్లో సాక్షి మాలిక్ ఒక పతకం తేవడంతో మరో పతకాన్ని యోగేశ్వర్ కూడా తెస్తాడని యావత్ భారతదేశం ఆశగా ఎదురుచూస్తోంది. మరోవైపు భారత రెజ్లింగ్ ఫ్రీ స్టయిల్ కోచ్ జగ్మిందర్ సింగ్ కూడా యోగేశ్వర్ పతకంపై ఆశాభావం వ్యక్తం చేశారు. తాము ఏది చేయాలో అది చేయడానికి సర్వశక్తులు ఒడ్డుతామని పేర్కొన్నారు. రెజ్లర్ నర్సింగ్ యాదవ్ నిషేధం విధించడం తమను నిరాశకు గురి చేసినా, ప్రస్తుతం భారత్ ఖాతాలో పతకం చేర్చడమే తమ లక్ష్యమన్నారు.
ఈ రోజు జరిగే యోగేశ్వర్ రెజ్లింగ్ పోరు కోసం మరోసారి అభిమానులు టీవీలకు అతుక్కుపోయే అవకాశం ఉంది. మొత్తం అన్ని రౌండ్ల రెజ్లింగ్ ఒకేసారి జరుగుతుండటంతో యోగేశ్వర్ ఏం చేస్తాడనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది.