అమేథీలో పర్యటించనున్న ఆప్ నేత కుమార్ విశ్వాస్
Published Wed, Dec 25 2013 11:06 PM | Last Updated on Wed, Apr 4 2018 7:42 PM
లక్నో/ఢిల్లీ: ఆమ్‌ఆద్మీ పార్టీ నేత కుమార్ విశ్వాస్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న అమేథీ నియోజక వర్గ పర్యటనకు వెళ్లనున్నట్లు ప్రకటించారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఈ నియోజక వర్గం నుంచి విశ్వాస్ రాహుల్ మీద పోటీకి దిగనున్నట్లు భావిస్తున్నారు. ‘జాదు సందేశ్ యాత్రలో’ పాల్గొనడం ద్వారా నియోజక వర్గపు రాజకీయ పరిస్థితిని పరిశీలించనున్నట్లు ఆయన ప్రకటించారు. డిసెంబర్ 27వ తేదీ నుంచి ఈ యాత్ర ప్రారంభమౌతుందని వివరించారు.
ఉత్తరప్రదేశ్‌లో పాదుకొనడానికి ఈ యాత్ర ఉపకరించే అవకాశం ఉందని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. ఢిల్లీ సంచలన విజయం తర్వాత దేశ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర నిర్వహించాలని భావిస్తున్న ఆప్ పార్టీ కళ్లు పలు ప్రముఖులు ప్రాతినిథ్యం వహిస్తున్న లోక్‌సభ స్థానాల మీద గురి నిలిపింది. అరవింద్ కేజ్రీవాల్‌కు సన్నిహితుడుగా భావించే మనీష్ సిసోడియా విశ్వాస్ రాహుల్‌పై బరిలోకి దిగనున్నట్లు కొద్ది రోజుల కిందట ప్రకటించారు. మరో ఆప్ పార్టీ సీనియర్ నేత మాట్లాడుతూ ‘‘ జాదు సందేశ్ యాత్ర’ ప్రజలను సమీకరించే లక్ష్యంతో నిర్వహిస్తున్నాం. ఈ యాత్ర సందర్భంగా విశ్వాస్ పలు బహిరంగ సభలను ఏర్పాటు చేస్తారు’’ సాయినాథ రోడ్డులోని ఆప్ పార్టీ కార్యాలయంలో కార్యకర్తలను ఉద్దేశించి పేర్కొన్నారు.
కాంగ్రెస్ నాయకుల మీద దండెత్తడంలో విశ్వాస్ అతి చురుకుగా వ్యవహరించేవాడు. ఇప్పుడు ఢిల్లీ ప్రభుత్వ ఏర్పాటులో వెలుపలి నుంచి మద్దతు అందుకొంటున్న ఆప్ పార్టీ ఏవిధంగా వ్యవహరించాల్సి వస్తుందో వేచిచూడాల్సిందే అని పలువురు రాజకీయ విశ్లేషకులు వాక్యానిస్తున్నారు. కాగా ఉత్తరప్రదేశ్ ప్రజాపనుల శాఖ మంత్రి శివపాల్ సింగ్ యాదవ్ రాష్ట్రంలో ఆప్ పోటీకి దిగుతుందనే వార్తలను కొట్టిపారేశారు. మంగళవారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఆప్ పార్టీ ప్రభావం ఉత్తరప్రదేశ్‌లో పెద్దగా ఉండదని వ్యాఖ్యానించారు.
Advertisement
Advertisement