ఆప్ వెనకడుగువే స్తోంది: గోయల్
Published Thu, Dec 12 2013 11:12 PM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో ఆమ్ ఆద్మీ పార్టీ వెనక్కి తగ్గుతోందని బీజేపీ ఢిల్లీప్రదేశ్ అధ్యక్షుడు విజయ్ గోయల్ ఆరోపించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు బీజేపీ సిద్ధంగా ఉందన్నారు. గురువారం నిర్వహించిన ఢిల్లీ బీజేపీ ఆఫీస్ బేరర్స్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఢిల్లీలో ఉప ఎన్నికలు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని వారికి సూచించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎంతో కృషి చేసిన పార్టీ నాయకులను అభినందిస్తున్నారన్నారు. ‘బీజేపీకి పార్టీ కేడర్ ఉంది. ఢిల్లీలో ఎలాంటి పరిస్థితిని ఎదుర్కోవడానికైనా మేం సిద్ధంగా ఉంటాం.
ఆప్ పూర్తిగా కాంగ్రెస్ పార్టీ చెప్పుచేతల్లో ఉంద’ని ఆరోపించారు. ఆప్ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ మద్దతు ఇస్తామని చెప్పడంతోనే వారి మధ్య ఉన్న బంధం తెలిసిందన్నారు. అవసరం అనుకుంటే కాంగ్రెస్ పార్టీ మద్దతు తీసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఆప్ ఎందుకు వెనుకంజ వేస్తుందో చెప్పాలన్నారు. తాను చేసిన వాగ్ధానాలు నెరవేర్చలేనన్న అనుమానంతోనే ఆ పార్టీ నాయకులు ప్రభుత్వ ఏర్పాటులో సంశయంతో ఉన్నారన్నారు. ఆప్ ఇచ్చిన హామీలు ఆచరణ యోగ్యం కావని వారికి అర్థమైందన్నారు. వారికి ప్రజాస్వామ్యాన్ని బలపర్చాలన్న ఉద్దేశం ఉంటే పాజిటివ్ అజెండాతో పనిచేయాలన్నారు.
హామీలు నెరవేర్చలేమనే భయం: కాంగ్రెస్
ఆచరణ యోగ్యం కాని హామీలను ప్రజలకిచ్చి అధిక సీట్లను సాధించిన బీజేపీ, ఆప్‌లు ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు వెనుకంజ వేస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తే ఆ హామీలను నెరవేర్చలేమన్న భయంతోనే ముందుకు రావడం లేదని ఆ పార్టీ ఎంపీ సంజయ్ నిరూపమ్ గురువారం విలేకరులకు తెలిపారు. మరో ఆరునెలల్లో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లోపు హామీలు నెరవేర్చకపోతే ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తుందని భయపడుతున్నాయని విమర్శించారు.
Advertisement
Advertisement