పని మనిషిపై నటి శ్రుతి పరువు నష్టం దావా
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : బహు భాషా నటి శ్రుతి తన పని మనిషి శోభాపై బుధవారం పరువు నష్టం దావా దాఖలు చేయనున్నారు. మంగళవారం శ్రుతి ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ తాను వేధించానంటూ గతంలో శోభా చేసిన ఫిర్యాదుపై బసవేశ్వర నగర పోలీసులు దర్యాప్తు చేశారని, ఆ సందర్భంగా ఆమె చేసిన ఆరోపణలకు ఎలాంటి సాక్ష్యాధారాలు లభించలేదని వివరించారు. డబ్బు ఆశతో తాను ఆరోపణలు చేశానని దర్యాప్తు సందర్భంగా శోభా ఒప్పుకుందని చెప్పారు. దీని వెనుక తాను విడాకులిచ్చిన చంద్రచూడ్ హస్తం ఉన్నట్లు తేలిందని వెల్లడించారు. తన కదలికలపై శోభా ఎప్పటికప్పుడు అతనికి సమాచారం చేరవేస్తూ ఉండేదని చెప్పారు. ఈ క్రమంలో తనపై లేని పోని ఆరోపణలు చేయడం ద్వారా, సమాజంలో తన గౌరవానికి భంగం కలిగించినందున దావా వేయాలని నిర్ణయించినట్లు ఆమె తెలిపారు.