
అసభ్య ప్రవర్తనతో ఉబర్ డ్రైవర్ అరెస్ట్
బెంగళూరు : ఉబర్ సంస్థ మరోసారి వార్తల్లో నిలిచింది. మహిళ ప్రయాణికురాలిని వేధించిన ఘటనలో ఉబర్ క్యాబ్ డ్రైవర్ను బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. ఈ సంఘటన బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే క్యాబ్ ఎక్కిన తనతో ఉబర్ డ్రైవర్ అసభ్యంగా ప్రవర్తించినట్లు ఓ మహిళ ట్విట్టర్ ద్వారా తమకు ఫిర్యాదు చేసినట్లు సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు.
మహిళ ఫిర్యాదుతో క్యాబ్ డ్రైవర్ సురేష్ను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. అతడు రెండు నెలల క్రితమే విధుల్లోకి చేరినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా గతంలో దేశ రాజధాని ఢిల్లీలో ఓ ఉబర్ కారు డ్రైవర్ మహిళను దారుణంగా రేప్ చేయటంతో ఢిల్లీ సర్కారు ఏకంగా ఉబర్ పై నిషేధం కూడా విధించిన విషయం తెలిసిందే. భారత్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉబర్ డ్రైవర్ల వ్యవహారశైలిపై పలు ఆరోపణలు ఉన్నాయి.