
నటించాలన్నది నా నిర్ణయమే
ఒక స్టార్ కుటుంబం నుంచి వచ్చే నటి కథానాయికగా పరిచయ చిత్రం అనగానే చాలా జాగ్రత్తలు తీసుకుంటుంటారు.
ఒక స్టార్ కుటుంబం నుంచి వచ్చే నటి కథానాయికగా పరిచయ చిత్రం అనగానే చాలా జాగ్రత్తలు తీసుకుంటుంటారు.ఆ చిత్రంలో నాయకి పాత్రను ఎలివెట్ చేసే సన్నివేశాలుండాలి, నటనకు అవకాశం ఉండాలి, యువతను ఆకర్షించే సన్నివేశాలుండాలి, గ్లామర్ ఉండాలి, టాప్ దర్శకుడై ఉండాలి, పెద్ద నిర్మాణ సంస్థ అయ్యుండాలి లాంటి పలు అంశాల గురించి ఆలోచిస్తారు. అలాంటిది ఒక గొప్ప నట కుటుంబం నుంచి వచ్చే అమ్మాయి అయితే ఇంకెంత జాగ్రత్తలు తీసుకోవాలి? అయితే అలాంటి నరనరాల్లో నటనే ప్రవహించే కుటుంబం నుంచి వచ్చి అక్షరహాసన్ తెరంగేట్రం గురించి అంత పరిశీలన జరిగిందా? అన్న విషయాన్ని పక్కన పెడితే ఆమె నటించిన తొలి చిత్రాన్ని గమనిస్తే ఒక్క నటన కు తప్ప మరే అంశానికి ప్రాముఖ్యతనిచ్చినట్లు కనిపించదు.
అక్షర పాత్రకు ఒక్క పాట ఉండదు. రొమాన్స్ ఉండదు. హాస్యపు పాళ్లు కూడా కనిపించవు. ఒక్క నటన పైనే ఆధారపడ్డ పాత్ర. పైగా బాలీవుడ్ మహానటుడు అమితాబ్‌బచ్చన్, కోలీవుడ్ స్టార్ నటుడు ధనుష్ సహనటులు. అలాంటి పాత్రను అవలీలగా చేసి సకలకళావల్లభుడు కమలహాసన్ వారసురాలనిపించుకున్నారు అక్షరహాసన్. ఆ చిత్రమే షమితాబ్ అసలు నటనే వద్దు తెర వెనుక సాధిస్తానన్న అక్షర నటిగా తెరంగేట్రం చేయడానికి కారణం ఏమిటీ?అసలు నటిగా ఆమె అరంగేట్రం సినీ రంగమే నా?వీటి వెనుక గల ఆసక్తికర అంశాలేమిటో చూద్దాం
ప్ర: నటనే వద్దనుకున్న మీరు నటిగా ప్రవేశించడానికి కారణం?
జ:నిజం చెప్పాలంటే నటినవ్వాలని నాపై ఎవరి ఒత్తిడి లేదు. అలాగే నటుడి కూతురు నటి అవ్వాలనీ లేదు. నా తల్లిదండ్రుల బలవంతం అస్సలు లేదు. నటించాలన్నది పూర్తిగా నా నిర్ణయమే. ఇక నటినవ్వాలనే నిర్ణయానికి రావడానికి కారణం లేకపోలేదు. నృత్యం, ఫుట్‌బాల్ క్రీడలంటే నాకెంతో ఆసక్తి. వాటిలో శిక్షణ పొందాను. అలాంటి సమయంలో అనూహ్యంగా ఏర్పడ్డ విపత్తులో రెండు కాళ్లు బాధింపునకు గురయ్యాయి. దీంతో చికిత్సానంతరం ఏడాదిన్నర పాటు విశ్రాంతి తీసుకోవలసి వచ్చింది. దాంతో నృత్యం, ఫుట్‌బాల్ క్రీడలను పక్కన పెట్టి దర్శకత్వంపై దృష్టి సారించాలనుకున్నాను.అలా సహాయ దర్శకురాలి అవతారం ఎత్తాను.
ప్ర: మరి మీలో నటి ఉన్నారన్న విషయాన్ని ఎప్పుడు గ్రహించారు?
జ: కాళ్లగాయాలతో ఏడాదిన్నర విరామంతో చాలా మనోవేదనకు గురయ్యాను. చెన్నైలో కృతిక అనే స్నేహితురాలుంది. తను మంచి నాట్య కళాకారిణి, రంగస్థల నటి. ఒక నాటకంలో నన్ను నాట్యం చేయమని అడిగింది. నా ఆసక్తిని ఆమెకు చెప్పడంతో సరే నటించూ అని అంది. అలా ఆ నాటకంలో నటించాను. అంతేకాదు నటనలో అంత సంతోషం ఉంటుందని అప్పుడే అర్థమైంది. నటనపై ఆసక్తి పెరిగింది.
ప్ర: షమితాబ్‌లో నటించే అవకాశం ఎలా వచ్చింది?
జ; నటనపై ఆసక్తి కలిగిన తరువాత నేను విన్న తొలి కథ షమితాబ్. కథ నచ్చడంతో నటించడానికి ఓకే చెప్పాను.
ప్ర: ఆ చిత్రంలో అమితాబ్, ధనుష్ లాంటి సీనియర్ నటులు నటించారుగా?
జ; అవును. నేనాచిత్రంలో నటించడానికి అదీ ఒక కారణం
ప్ర: మీ తల్లిదండ్రులిచ్చిన సలహా?
జ:ఏ రంగాన్ని ఎంచుకున్నా అందులో పూర్తిగా దృష్టి సారించి కఠినంగా శ్రమించాలని చెప్పారు. ఏదీ అరకొరగా చేయకుండా పూర్తి ఏకాగ్రతతో కృషి చెయ్యాలని సలహా ఇచ్చారు.
ప్ర:మీ నాన్న నటనలో మీకు నచ్చిన అంశం?
జ:నాన్న నటనలో నచ్చింది హాస్యమే. నవ్వించడం చాలా కష్టం.అదీ ఒక కథానాయకుడిగా నవ్వించడం ఇంకా కష్టం. ఆ విధంగా నాన్న హాస్యం నాకెప్పుడూ ఆశ్చర్యమే.