కాసిన్ని నీళ్లు.. ఇంకొంత అల్యూమినియం!.. ఓ కారు రయ్యి రయ్యిమని దూసుకెళ్లేందుకు..ఇవి మాత్రమే చాలని ఎవరైనా చెబితే?.. ఫక్కున నవ్వేస్తాం..అంత సీన్ లేదులే అని కొట్టిపారేస్తాం! కానీ... చెప్పేవాడు అక్షయ్ సింఘల్ అయితే? ఎవరీయన.. ఏమా కథా కమామిషు????
బెంగళూరులోని బోలెడన్ని స్టార్టప్ కంపెనీల్లో ‘లాగ్9 మెటీరియల్స్’కూడా ఒకటి. ఈ కంపెనీ సీఈవోనే అక్షయ్ సింఘల్. పట్టుమని పాతికేళ్లు కూడా నిండలేదుగానీ..ఈ రూర్కేలా ఐఐటీ విద్యార్థి బుర్రలో పుట్టిన ఐడియా మాత్రం సూపర్! కేవలం నీళ్లు, అల్యూమినియంతో విద్యుత్‌ను ఉత్పత్తి చేయగల ఓ సరికొత్త ఫ్యూయల్‌సెల్ బ్యాటరీని తయారు చేశాడు. ఎక్కడో ఉత్పత్తి అయిన విద్యుత్‌ను నిల్వ చేసుకోవడం కాకుండా ఈ కొత్త రకం బ్యాటరీలు అక్కడికక్కడే విద్యుత్తును ఉత్పత్తి చేస్తాయి. అల్యూమినియం లాంటి అనేక లోహాలతో ఇలాంటి మెటల్ ఎయిర్ బ్యాటరీలను తయారు చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే వీటి ఖరీదెక్కువ. ఉత్పత్తి అయ్యే విద్యుత్ కూడా తక్కువగానే ఉండటంతో ఇప్పటివరకూ అవి విజయవంతం కాలేదు. అక్షయ్ సింఘల్ కంపెనీ మాత్రం ఈ సమస్యను గ్రాఫీన్‌తో అధిగమించింది.
లీటర్ నీటికి 300 కి.మీ..
విద్యుత్‌తో నడిచే కార్లు మనకు కొత్త కాకపోవచ్చుగానీ.. వాటితో సమస్యలూ ఎక్కువే. బ్యాటరీ చార్జ్ చేసేందుకు ఎక్కువ సమయం పట్టడం, ఒకసారి చార్జ్ చేసుకుంటే ప్రయాణించగలిగే దూరం పరిమితంగా ఉండటంతో చాలామంది వీటి కొనుగోలుకు ఆసక్తి చూపడం లేదు. గ్రాఫీన్, మెటల్ ఎయిర్ బ్యాటరీల వాడకం ద్వారా తాము ఈ సమస్యలను అధిగమించగలిగామని అక్షయ్ సింఘల్ ‘సాక్షి’కి తెలిపారు. బ్యాటరీలో వాడే అల్యూమినియం రేకులను వెయ్యి కిలోమీటర్లకు ఒకసారి మార్చుకోవాల్సి ఉంటుందని, ఒక్క లీటర్ నీరు పోసుకుంటే కనీసం 300 కిలోమీటర్ల దూరం ప్రయాణించేందుకు అవసరమైన విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చునని వివరించారు. ఈ బ్యాటరీలో ఉండే గ్రాఫీన్ కడ్డీ అల్యూమినియం, నీళ్ల మధ్య జరిగే రసాయన చర్య.. విద్యుత్ ఉత్పత్తికి సాయపడుతుందని పేర్కొన్నారు. ఈ కొత్త రకం బ్యాటరీని కేవలం విద్యుత్ వాహనాలకు మాత్రమే గాక.. ఇళ్లు, వాణిజ్య సంస్థల్లోనూ జనరేటర్ల మాదిరిగా వాడుకునే అవకాశం ఉందన్నారు. తాము ఇప్పటికే ఈ బ్యాటరీతో నమూనా కారు ఒకదాన్ని సిద్ధం చేసి పరీక్షిస్తున్నామని అక్షయ్ వివరించారు.
ఖర్చు మాటేమిటి?
నీళ్లతో పనిచేసే కారు అనగానే ఖర్చు చాలా తక్కువని అందరూ అనుకుంటారు. అయితే ప్రస్తుతానికి ఈ కారుతో ప్రయాణం ఖర్చు సాధారణ పెట్రోలు, డీజిల్ కార్లతో సమానంగానే ఉంటుంది. ఎందుకంటే ఇందులో వాడే అల్యూమినియం కారును ప్రతి వెయ్యి కిలోమీటర్లకు ఒకసారి మార్చుకోవాల్సి ఉంటుంది,. ప్రస్తుతానికి ఒక్కో అల్యూమినియం ప్లేటు ఖరీదు రూ.5,000 వరకూ ఉంది. అయితే ఈ కార్ల వాడకం పెరిగినా కొద్దీ దీని ఖరీదు గణనీయంగా తగ్గుతుందని అక్షయ్ అంటున్నారు. కేవలం 15 నిమిషాల్లోనే అల్యూమినియం ప్లేట్‌ను మార్చుకుని మళ్లీ ప్రయాణించ గలగడం ఈ కారుకు ఉన్న మరో విశేషం. అంటే చార్జింగ్ కోసం గంటల కొద్దీ వేచి చూడాల్సిన అవసరం లేదన్నమాట. లిథియం అయాన్ బ్యాటరీలతో పోలిస్తే ఈ మెటల్ ఎయిర్ బ్యాటరీల ధర సగం మాత్రమే ఉంటుందని.. ఫలితంగా ఈ కొత్త బ్యాటరీలతో నడిచే కారు ధర తక్కువగానే ఉంటుందని అక్షయ్ పేర్కొన్నారు.
– సాక్షి నాలెడ్జ్ సెంటర్
Comments
Please login to add a commentAdd a comment