ఆటంబాంబు పేల్చిన అళగిరి
అన్నాడీఎంకేకు అనుకూలంగా వ్యాఖ్యలు
లక్ష్యం లేని కాంగ్రెస్, డీఎంకేలు
స్టాలిన్ పర్యటన ఓ జోక్
చెన్నై: రాష్ట్ర రాజకీయాల్లో సంచలన వ్యాఖ్యలకు కేంద్ర బిందువైన డీఎంకే మాజీ నేత అళగిరి మరోసారి ఆటంబాంబు పేల్చారు. సొంత పార్టీపైనే విమర్శలు గుప్పించి, అన్నాడీఎంకేకు వత్తాసు పలికారు. డీఎంకే అధినేత కరుణానిధి పెద్ద కుమారుడైన అళగిరి, చిన్న కుమారుడైన స్టాలిన్ మధ్య ఎంతోకాలంగా ఆధిపత్య పోరు సాగుతోంది. డీఎంకేలో దక్షిణ తమిళనాడుకు సారథ్యం వహిస్తున్న అళగిరి మదురై జిల్లాను కేంద్రంగా చేసుకుని పెద్ద ఎత్తున తన అనుచర వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు.
అలాగే స్టాలిన్ పార్టీ కోశాధికారిగా వ్యవహరిస్తున్నారు. కరుణ తర్వాత పార్టీకి వారసులు ఎవరనే అంశంతో వారిద్దరి మధ్య కరుణానిధి తన చిన్నకుమారుడైన స్టాలిన్‌ను ప్రో త్సహిస్తూ వస్తున్నారు. ఇది సహించలేని అళగిరి బహిరంగంగా తన అసంతృప్తిని వెళ్లగక్కారు. స్టాలిన్ కారణంగా సర్వనాశనం అంటూ పార్టీని తూర్పారబట్టారు. కరుణానిధి పార్లమెంటు ఎన్నికల సమయంలో పార్టీ నుంచి అళగిరిని బహిష్కరించారు. దీంతో మరింత స్వేచ్ఛ లభించిందని భావించిన అళగిరి పార్లమెంటు ఎన్నికల్లో డీఎంకే అభ్యర్థులకు డిపాజిట్లు దక్కవని బహిరంగ ప్రకటన చేశారు.
ఆయన అన్నట్లుగానే డీఎంకే ఘోర ఓటమిని చవిచూసింది. ఇదిలా ఉండగా, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్, డీఎంకే పొత్తుపెట్టుకోవడంపై బుధవారం మరోసారి విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్, డీఎంకే రెండునూ ఒక రాజకీయ లక్ష్యం లేని పార్టీలని దుయ్యబట్టారు. ఎన్ని కూటమిలు ఏర్పడినా అన్నాడీఎంకేను ఏమీ చేయలేవని పేర్కొన్నారు. స్టాలిన్ నిర్వహిస్తున్న మనకు మనమే పర్యటన ఒక జోక్‌గా మారిందని అని ఎద్దేవా చేశారు.
అళగిరి మాటలపై మరింతగా మండిపడిన కరుణానిధి, అతని మాటలు పట్టించుకోవద్దని, అతనికి డీఎంకేకు ఎటువంటి సంబంధం లేదని ప్రకటించారు. డీఎంకే అభివృద్ధికి తాను ఎంతోపాటూ పడ్డాను, జైలుకు వెళ్లాను, విమర్శించే హక్కు తనకు ఉందని తండ్రికే సవాలు విసిరాడు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న దశలో అళగిరి పేలుస్తున్న అవాకులు చవాకులు డీఎంకేకు తలనొప్పిగా మారింది.