
గణేశ్ ఉత్సవాలపై సందిగ్ధత
- నియమావళిని విడుదల చేయని బీఎంసీ
- ఆందోళన వ్యక్తం చేస్తున్న ఉత్సవ మండళ్లు
- 30 రోజుల్లో మొదలుకానున్న ఉత్సవాలు
సాక్షి, ముంబై: గణేశ్ ఉత్సవాలు దగ్గర పడుతున్నా మండపాల ఏర్పాటు విషయంలో ప్రభుత్వం విధించిన నిబంధనలపై ఎలాంటి స్పష్టత రాకపోవడంతో ఉత్సవ మండళ్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మండపాల నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ మండళ్ల పదాధికారులు మహానగర పాలక సంస్థ (బీఎంసీ) కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఆంక్షలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు జారీ కాకపోవడంతో అనుమతులిచ్చేందుకు అధికారులు నిరాకరిస్తున్నారు.
గణేశ్ ఉత్సవాలకు నెల రోజుల సమయమే ఉందని, అనుమతులిస్తే మండపాల నిర్మాణ పనులు ప్రారంభించేందుకు మార్గం సుగమవుతుందని నిర్వాహకులు చెబుతున్నారు. భారీ గణేశ్ విగ్రహాలు ప్రతిష్టిం చే సార్వజనిక ఉత్సవ మండళ్లలో ఎక్కువగా ఫూట్‌పాత్‌లు, రహదారుల పక్కన మండపాలు ఏర్పాటు చేస్తాయి. దీంతో వాహనాల రాకపోకలకు, బాటసారులకు ఇబ్బం దులు ఎదురవుతున్నాయని బాంబే హైకోర్టులో ప్ర జా ప్రయోజన వ్యాజ్యం గతంలో దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తుల బెంచి, మండపాలకు అనుమతిచ్చే ముందు వాహనాలకు, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని బీఎంసీని ఆదేశించింది.
దీంతో అసంతృప్తి వ్యక్తం చేసిన బృ హన్ ముంబై సార్వజనిక గణేశ్ ఉత్సవ మం డళ్లు నిబంధనల్లో మార్పులు చేయాలని కోరు తూ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు వినతి పత్రం అందజేశాయి. సానుకూలంగా స్పందిం చిన సీఎం, తుది నిర్ణయం తీసుకోవాలని బీ ఎంసీ అధికారులకు సూచించారు. కాని గణేశ్ ఉత్సవాలకు సంబంధించిన అనుమతుల ని యమావళి ఇంకా విడుదల చేయకపోవడంతో మండళ్ల పదాధికారులు గందరగోళంలో పడ్డా రు. పుణ్యకాలం కాస్తా గడచిపోయాక ప నులు ఎప్పుడు పూర్తి చేసుకోవాలని ప్రశ్నిస్తున్నారు.
ఇప్పుడెట్లా..?: ప్రతి ఏడాది ఉత్సవాలకు 45 రోజుల ముందు బీఎంసీ అనుమతివ్వగానే ట్రాఫిక్ శాఖ, స్థానిక పోలీసు స్టేషన్, అగ్నిమాపక శాఖ నుంచి అనుమతులు తీసుకుని పనులు ప్రారంభిస్తారు. కాని ఈసారి 30 రోజులే మిగిలి ఉండడంతో వివిధ శాఖల నుంచి అనుమతులు ఎప్పుడు తీసుకోవాలి, పనులు ఎప్పుడు ప్రారంభించాలో తెలియక నిర్వాహకులు సందిగ్ధంలో పడిపోయారు.