అవుట్ సోర్సింగ్ అర్చకులను విచారిస్తున్న డీఈ రవీందర్
నగల మాయంపై మరో కోణం!
Published Fri, Oct 28 2016 4:48 PM | Last Updated on Fri, Aug 3 2018 3:04 PM
విచారణకు రమ్మంటూ ఆలయ సిబ్బందికి పిలుపు
అవుట్ సోర్సింగ్ అర్చకుల నుంచి వివరాలు సేకరణ
హైదరాబాద్ స్థాయిలో ఓ ఉన్నతాధికారి అండదండలున్నట్లు ప్రచారం
భద్రాచలం: రామాలయంలో నగల మాయంపై విచారణ మళ్లీ మొదటికొచ్చింది. నివేదిక సిద్ధమవుతుందని అంతా భావిస్తున్న తరుణంలో ఆలయ సిబ్బందిని కూడా విచారణకు పిలవటంతో ఇది ఇప్పట్లో తేలేలాలేదని భక్తులు అంటున్నారు. ఆలయంలో పనిచేసే ఇద్దరు అవుట్ సోర్సింగ్ అర్చకులను తన చాంబర్‌లో విచారించారు. నగల మాయమై, తిరిగి ప్రత్యక్షమైన రోజు వరకూ అసలేం జరిగిందనే దానిపై అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేస్తున్న ఇద్దరు అర్చకులను అడిగి తెలుసుకున్నారు. అర్చకులు తెలిపిన వివరాలను రికార్డు చేయటంతో పాటు, వారి నుంచి రాతపూర్వకంగా వాంగ్మూలాన్ని తీసుకున్నారు. అదేవిధంగా ఆలయ సూపరింటెండెంట్ నర్సింహరాజు, మరో ఇద్దరు ఉద్యోగులు రామారావు, సాయిబాబాలను కూడా విచారణకు హాజరు కావాలని విచారణాధికారి రవీందర్ వారికి నోటీసులు అందజేశారు. ఇప్పటి వరకూ ఇద్దరు ప్రధానార్చకులతో పాటు, 11 మంది అర్చకుల నుంచి వివరాలను సేకరించిన డీఈ రవీందర్ వారు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా నేడో, రేపో నివేదికను ఈవో రమేష్‌బాబుకు అందజేసే అవకాశం ఉందని అంతా భావించారు. కానీ మరికొంత మంది ఉద్యోగులను కూడా విచారణకు హాజరుకావాలని ఆదేశించటంతో ఇది మరికొంతకాలం సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
సాగదీతలో ఆంతర్యమేమిటో..
దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన నగల మాయంలో దోషులెవరో తెలుసుకునేందుకు భక్తులంతా వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. సీతమ్మ వారి పుస్తెలతాడును మాయం చేసి పది రోజుల తరువాత అక్కడ పెట్టినప్పటికీ, అది వాస్తవమైనది కాదనే ప్రచారం ఉంది. మాయమైన రెండు బంగారు నగలు అమెరికాకు తరలించి వాటి స్థానంలో కొత్తవి చేయించి పెట్టారని అర్చకుల నుంచి గుసగుసలు వినిపిస్తున్నాయి. శ్రీసీతారాముల ఉత్సవమూర్తులను బేరం పెట్టింది మొదలు, నగల మాయం వరకూ జరిగిన మొత్తం ఎపిసోడ్‌లో ’ప్రధాన’ భూమిక పోషించిన అర్చకుడికి, హైదరాబాద్ స్థాయిలో ఓ ఉన్నతాధికారి అండదండలు ఉన్నాయనే ప్రచారం ఉంది. దీనిని ఏదో రీతిన మరుగనపరిచి, నగల మాయం వ్యవహారాన్ని భక్తులు మరిచిపోయేలా చేసేందుకే విచారణను సాగదీస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. పెద్దఎత్తున దుమారం రేపిన నగల మాయంలో వాస్తవాలు బయటకు వచ్చేలా విచారణను ఏదో ఒక స్వతంత్ర సంస్థకు అప్పగించకుండా, ఆలయంలో పనిచేసే అధికారితో మమ అనిపించేలా ఉన్నతాధికారులే తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నట్లుగా భక్తులు అంటున్నారు.
Advertisement