ఆయుధాలతో పట్టుబడ్డ అమెరికా నౌక
ఆయుధాలతో పట్టుబడ్డ అమెరికా నౌక
Published Wed, Oct 16 2013 9:18 AM | Last Updated on Thu, Apr 4 2019 3:20 PM
ఆయుధాలతో పట్టుబడిన అమెరికా నౌక కదలికలపై అనుమానాలు తలెత్తుతున్నాయి. నౌకలోని సిబ్బంది భిన్న కథనాలు వినిపిస్తున్నారు. దీంతో నిజాన్ని నిగ్గు తేల్చే దిశగా అధికారులు విచారణ ముమ్మరం చేశారు. నౌకలోని 25 మందిపై కేసులు నమోదు చేశారు. అదే సమయంలో భారత్-అమెరికా మధ్య చర్చలు మొదలయ్యాయి.
చెన్నై, సాక్షి ప్రతినిధి: అనుమతి లేకుండా తూత్తుకూడి హార్బర్ వైపు ప్రయాణిస్తున్న ‘సీమెన్ గార్డ్’ అనే నౌకను ఈ నెల 12న అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తొలుత ఇది చైనా నౌకగా భావించారు. తర్వాత అమెరికాలోని అడ్వన్ పోర్ట్ అనే ప్రయివేటు సెక్యూరిటీ సంస్థకు చెందిన నౌకగా గుర్తించారు. తీరానికి 30 నాటికల్ మైళ్ల దూరంలో నిలిపేసిన ఈ నౌకను మంగళవారం తూత్తుకూడి హార్బర్‌లోని 2వ బెర్త్‌లో పెట్టి తనిఖీలు చేశారు. ఈ నౌకలో 10 గదులు, 25 మంది సైనికు లు, 35 అత్యాధునిక తుపాకులు, 5 వేల తూటాలు ఉన్నట్లు సమాచారం. తూత్తుకూడి హార్బర్ అధికారులు మాత్రం 13 అనుమానాస్పద వస్తువులు ఉన్నాయని చెబుతున్నారు.
భిన్న కథనాలు: అమెరికా నౌక తూత్తుకూడి హార్బర్ సమీపంలో ప్రయాణించడం వెనుక భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. పై-లీన్ తుపాను నుంచి రక్షణ పొందేందుకే హార్బర్‌కు చేరుకున్నామని అమెరికా వర్గాలు ప్రకటించాయి. తూత్తుకూడికి చెందిన ఒక పారిశ్రామికవేత్త 10 బారెళ్ల ద్వారా నౌకలోకి 2 వేల లీటర్ల డీజిల్‌ను చేరవేశాడు. ఇందుకు కోసం కొన్నిమరబోట్లను రూ.15 వేల చొప్పున బాడుగ కు మాట్లాడుకున్నాడు. డీజిల్ కొనుగోలుకు నౌక కెప్టెన్ రూ.లక్షను సదరు పారిశ్రామికవేత్త బ్యాంకు ఖాతాలో జమ చేశాడు. హార్బర్ అధికారులు నౌకను చుట్టుముట్టుతున్న సమయంలో చాటుమాటుగా ఆ పది డీజిల్ బ్యారెళ్లను సముద్రంలోకి జార విడిచేందుకు సిబ్బంది ప్రయత్నించినట్లుగా సమాచారం. అయితే అధికారులు అప్రమత్తమై డీజిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. డీజిల్ కోసమే తూత్తుకూడి హార్బర్ వద్దకు వచ్చామని ఒకరు, పై-లీన్ తుపాను కారణంగా వచ్చామని మరొకరు భిన్నమైన సమాచారం ఇవ్వడం అనుమానాలకు తావిస్తోంది. ఈ నేపథ్యంలో అధికారులు విచారణను ముమ్మరం చేశారు.
తూత్తుకూడి జిల్లా కలెక్టర్ రవికుమార్ నౌకను మంగళవారం తనిఖీ చేశారు. ఇదిలా ఉండగా తూత్తుకూడిలోని మరో వ్యక్తి ద్వారా రహస్యంగా కూరగాయలు, పండ్లు చేరవేసేందుకు ప్రయత్నించారు. అయితే అప్పటికే ఆ నౌకను రక్షణ సిబ్బంది చుట్టుముట్టడంతో సదరు వ్యక్తి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. సముద్రపు దొంగల నుంచి తమ నౌకలను కాపాడుకునేందుకే మారణాయుధాలను సిద్ధం చేసుకున్నామని నౌకలోని సిబ్బంది అంటున్నారు. అనేక అంశాల్లో నిబంధనలను అతిక్రమించినట్లు భావించిన తూత్తుకూడి హార్బర్ అధికారులు నాలుగు సెక్షన్ల కింద నౌకలోని 25 మందిపై కేసులు పెట్టారు. వీరిలో ఆరుగురు బ్రిటిష్‌వారు, 14 మంది ఈస్టోనియా దేశస్తులు, ఒక ఉక్రెయిన్ వ్యక్తి, నలుగురు భారతీయులు ఉన్నట్లు కోస్ట్ గార్డు రీజియన్ (తూర్పు) చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. నౌక అంశంపై భారత్- అమెరికాల మధ్య చర్చలు సాగుతున్నాయి.
Advertisement