ముంబై: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ డ్రామాలను ఆపి ప్రభుత్వ పాలనపై దృష్టి సారించాలని ఏఐసీసీ కార్యదర్శి సంజయ్ నిరుపమ్ కోరారు. తమ మాట వినని పోలీసు అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నేత కేజ్రీవాల్, ఆ పార్టీ మంత్రులపై మండిపడ్డారు. కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అని, కేంద్రంతో చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించుకోవచ్చని ఉత్తర ముంబైకి చెందిన ఎంపీ నిరుపమ్ తెలిపారు. దక్షిణ ఢిల్లీలో డ్రగ్, సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్న గృహాలపై దాడులు చేసేందుకు నిరాకరించిన పోలీసులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ రైల్ భవన్ ప్రాంగణంలో కేజ్రీవాల్, మంత్రులు సోమవారం ధర్నాకు దిగిన సంగతి తెలిసిందే. అయితే ఆ పార్టీకి ఢిల్లీలో మద్దతివ్వడానికి రెండు కారణాలు ఉన్నాయని నిరుపమ్ తెలిపారు. ప్ర భుత్వ పాలన లేకుండా ఢిల్లీవాసులకు అన్యాయం జరగకుండా ఉండొద్దనే ఆప్‌కు మద్దతిస్తున్నామన్నారు. ప్రభుత్వ పాలనపై దృష్టి సారించాల్సిన బాధ్యత ఆప్‌పై ఉందని తెలిపారు. వాళ్లకి ప్రభుత్వ పాలనపై ఎలాంటి అవగాహన లేదనడం మాత్రం నిజమేనని నిరుపమ్ వ్యాఖ్యానించారు.