
ఆర్యతో అనుష్క రెండోసారి
ఆర్య, అనుష్క రెండోసారి జతకడుతున్నారు. ఇంజి ఇడుప్పళగి పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ పివిపి నిర్మిస్తోంది. తమిళం, తెలుగు భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రానికి తెలుగులో జీరో సైజ్ అనే పేరును నిర్ణయించారు. ఈ చిత్రానికి ప్రఖ్యాత టాలీవుడ్ దర్శకుడు కె.రాఘవేంద్రరావు కుమారుడు కెఎస్ ప్రకాష్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ చిత్ర షూటింగ్ గురువారం ఉదయం స్థానిక వడపళనిలోని ఏవీఎం స్టూడియోలో ప్రారంభమైంది. చిత్ర వివరాలను దర్శకుడు ప్రకాష్ తెలుపుతూ ఇది రొమాంటిక్ ఎంటర్‌టైనర్ కథా చిత్రం అన్నారు. ఆర్య, అనుష్క హీరో హీరోయిన్లుగా చిత్రం చేయడం సంతోషంగా ఉందన్నారు. తాను చెన్నైలోనే పుట్టి పెరిగాను కాబట్టి తమిళ ప్రేక్షకుల అభిరుచి తెలుసన్నారు. ఈ ఇంజి ఇడుప్పళగి చిత్రాన్ని రెండు భాషల్లో ఆయా నేటివిటీకి తగ్గట్టుగా చిత్రీకరించనున్నట్లు తెలిపారు. తన తండ్రి రాఘవేంద్రరావు ఛాయలు పడకుండా తన శైలిలోనే రూపొందిస్తానన్నారు. అనుష్క మాట్లాడుతూ ఆర్యతో రెండో సారి చిత్రం చేయడం సంతోషంగా ఉందన్నారు.