వివాదాలకు ముగింపు పలకండి!
* రాష్ట్రాభివృద్ధికి అంతా కలసి పనిచేయండి
* నగరి ఎమ్మెల్యే రోజా కేసులో సుప్రీం కోర్టు
* ప్రజలే సుప్రీం.. న్యాయవ్యవస్థ, శాసన వ్యవస్థ కాదు
* తన మాటల్లో ఉద్దేశం ఏంటో చెబుతూ స్పీకర్‌కు రోజా లేఖ రాస్తారు
* ఆ లేఖతో ఇక ముగింపు పలకండి.. విచారణ నేటికి వాయిదా
సాక్షి,న్యూఢిల్లీ: రాష్ట్రాభివృద్ధికి అంతా కలసి పనిచేయాలని, వివాదాలకు ముగింపు పలకాలని ఏపీ రాష్ట్రానికి సుప్రీం కోర్టు హితవు పలికింది. తన మాటల్లో ఉద్దేశం ఏంటో తెలుపుతూ నగరి ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నేత ఆర్.కె.రోజా శాసనసభాపతికి లేఖ రాస్తారని, ఈ లేఖతో 3 అభియోగాలతో ముడివడి ఉన్న వివాదాలకూ ముగింపు పలకాలని సుప్రీం కోర్టు హితవు పలికింది.
ఇది తమ సలహా మాత్రమేనని స్పష్టం చేసింది. తనను ఏడాది పాటు సస్పెండ్ చేయడాన్ని హైకోర్టులో సవాలు చేయగా తనకనుకూలంగా ఏకసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ నిలిపివేయడాన్ని సవాలు చేస్తూ రోజా సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ గురువారం విచారణకు వచ్చింది. జస్టిస్ గోపాల గౌడ, జస్టిస్ అరుణ్‌మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది. దాదాపు నాలుగున్నర గంటల పాటు ఇరు పక్షాలు వాదనలు వినిపించిన అనంతరం తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. ముందుగా పిటిషనర్ ఆర్.కె.రోజా తరఫున సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ వాదనలు వినిపించారు.
రోజా సస్పెండైన తీరు, సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులు, దానిని నిలిపివేస్తూ డివిజన్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను వివరించారు. ‘‘శాసనసభ నిబంధనావళిలోని 340 (2) నిబంధన ప్రకారమే ఏడాదిపాటు సస్పెండ్ చేశామని తొలుత చెప్పిన ప్రభుత్వం, తరువాత రాజ్యాంగంలోని 194 ఆర్టికల్ ప్రకారం సస్పెండ్ చేశామంది. దీనిపై హైకోర్టుకు వెళ్లగా సింగిల్ జడ్జి అనుకూలంగా ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను డివిజన్ బెంచ్ రద్దు చేసింది. వాస్తవానికి 340 (2) నిబంధన కింద ఒక సభ్యుడిని ఆ సెషన్‌కు మాత్రమే సస్పెన్షన్ చేసే వీలుంది. కానీ రోజాను నిబంధనలకు విరుద్ధంగా డిసెంబర్ 18 నుంచి ఏడాదిపాటు సస్పెండ్ చేశారు.
ఇక ఆర్టికల్ 194 పరిధిలో సభాహక్కుల తీర్మానం ద్వారా సస్పెండ్ చేయాలనుకుంటే అందుకు వీలుగా ఏపీ శాసనసభ కార్యకలాపాల నిబంధనావళి చాప్టర్ 20లోని సెక్షన్ 170 నుంచి 174 వరకు గల ప్రక్రియను అనుసరించాలి. కానీ ఇవేవీ లేకుండా కేవలం నిబంధన తప్పుగా ప్రస్తావించామంటే సరిపోదు. ఇది పొరపాటు కాదు. పిటిషనర్‌కు తన వివరణ ఇచ్చే అవకాశమే లేకుండా చేశారు. ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం. కాల్‌మనీ సెక్స్ రాకెట్‌ను లేవనెత్తినందుకే రోజాను సభ నుంచి బయటికి పంపాలని చూశారు. డిసెంబర్ 18న జరిగిన 2 ఘటనల్లో వేర్వేరు గా స్పందించారు. సభానాయకుడిని దూషిం చారంటూ ఏడాది పాటు సస్పెండ్ చేశారు.
ఎమ్మెల్యే అనితను దూషించారంటూ ప్రివిలేజ్ కమిటీ నోటీసులిచ్చింది. ఈ రెండింటిలో విభిన్నంగా ఎలా వ్యవహరిస్తారు? సీఎంను దూషించారని భావిస్తే అప్పుడూ ప్రివిలేజ్ కమిటీ ద్వారా నోటీసులు ఇవ్వాలి కదా? తమిళనాడులో ఆరుగురు శాసనసభ్యుల సస్పెన్షన్ వ్యవహారంలో జస్టిస్ జాస్తి చలమేశ్వర్, జస్టిస్ అభయ్ మనోమర్ సాప్రేతో కూడిన ధర్మాసనం సహజ న్యాయసూత్రాలను పాటించలేదన్న కారణంతో సస్పెన్షన్‌ను ర ద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది’’ అని వాదించారు.
అహంతో తలెత్తుతున్న ఘర్షణలు
ఈ సందర్భంలో జస్టిస్ గోపాల గౌడ స్పందిస్తూ.. ‘‘చట్టసభలు ప్రజా సమస్యలపై చర్చించాలి. కానీ అహంతో ఘర్షణలు తలెత్తుతున్నాయి. సభా నాయకులు, ప్రతిపక్ష నేతల మధ్య వాగ్వాదాలు చోటు చేసుకుంటున్నాయి. మేధోపరమైన చర్చలు జరగడం లేదు’’ అన్నారు. తరువాత ప్రభుత్వం తరఫున న్యాయవాది పీపీ రావు స్పందిస్తూ ‘పిటిషనర్ సభకు క్షమాపణ చెప్పాలి’ అని కోరారు. జస్టిస్ అరుణ్ మిశ్రా జోక్యం చేసుకుంటూ ‘‘పిటిషనర్ క్షమాపణ చెబితే మీరు వ్యవహారాన్ని ముగిస్తారా?’’ అని అడగ్గా పీపీరావు సమ్మతించారు. ఇందిరా జైసింగ్ స్పందిస్తూ.. దీనికీ ఒక ప్రక్రియ ఉందని, దానిని అనుసరించకుండా ఎలా చెప్పగలమని జవాబిచ్చారు.
గత తీర్పులు పిటిషనర్‌కు అనుకూలం
జస్టిస్ గోపాల గౌడ మాట్లాడుతూ.. ‘‘ఈ కేసులో న్యాయసమీక్షకూ వెళ్లొచ్చు. సుప్రీం గతంలో ఇచ్చిన తీర్పులు పిటిషనర్ వాదనలకు బలం చేకూర్చేవే. పిటిషనర్ తాను సభానాయకుడిని ఏ ఉద్దేశంతో అన్నారో స్పీకర్‌కు వివరణ ఇస్తారు. సభాకార్యక్రమాలు సజావుగా నడవాలి. న్యాయ వ్యవస్థగానీ, శాసన వ్యవస్థగానీ సుప్రీం కాదు. ప్రజలే సుప్రీం. ఒకవేళ పిటిషనర్‌కు సమ్మతమైతేనే వివరణ ఇస్తారు. అది కూడా సభలోనే’’ అని పేర్కొన్నారు.
ఈ సందర్భంలో పిటిషనర్ తరఫు మరో న్యాయవాది నర్మద సంపత్.. పిటిషనర్‌కు వివరణ ఇచ్చే అవకాశం ఇవ్వలేదన్నారు. పీపీ రావు కల్పించుకుని.. విచారం వ్యక్తంచేస్తూ స్పీకర్‌కు ఎమ్మె ల్యే లేఖ ఇస్తే ఈ వ్యవహారాన్ని ముగిం చేందుకు స్పీకర్‌ను ఒప్పిస్తానన్నారు. ‘‘మీరు విచారం వ్యక్తం చేయాలంటూ పట్టుపట్టొద్దు. ‘నేను ఆ ఉద్దేశంతో అనలేదు’ అని కేవలం ఒక వాక్యంలో లేఖ రాస్తారు’’ అని జస్టిస్ గోపాల గౌడ పేర్కొన్నారు. ఇందిరా జైసింగ్ వాదనలు వినిపిస్తూ.. సభానాయకుడి విషయంలో, ఎమ్మెల్యేలు అనిత, కాల్వ శ్రీనివాసులు విషయంలో 3 అభియోగాలు మోపారని, అనిత, కాల్వ శ్రీనివాసులు విషయంలో సమాధానం ఇచ్చామని, మూడింటికీ ఈ లేఖ వర్తించాలని విన్నవించారు. దీనికి పీపీరావు అభ్యంతరం వ్యక్తంచేశారు.
దీంతో ఇందిరా జైసింగ్ ‘ముందుగా 3 అభియోగాలను ఉపసంహరించుకోమనండి. సస్పెన్షన్ ఎత్తివేయమనండి. అప్పుడు మా విచారం వ్యక్తంచేస్తాం’ అని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో పీపీ రావు తిరిగి వాదనలు వినిపించగా.. జస్టిస్ గోపాల గౌడ కల్పించుకుని ‘‘మీరు 194 అధికరణకు గల ప్రక్రియను అవలంబించలేదు. ఈ విషయంలో 2 రాజ్యాంగ ధర్మాసనాల తీర్పులు పిటిషనర్‌కు అనుకూలంగా ఉన్నాయి. మీరు సమస్యకు ముగింపు పలకండి’’ అన్నారు. తమ అభిప్రాయం చెప్పేందుకు శుక్రవారం వరకు ఆగాలని కోర్టును ఇందిరా జైసింగ్ అభ్యర్థించారు. జస్టిస్ గౌడ తిరిగి జోక్యంచేసుకుంటూ ‘సామరస్యంగా వ్యవహారం ముగిసిపోయేలా చర్యలు తీసుకోండి’ అని పీపీరావుకు చెబుతూ విచారణ వాయిదా వేశారు.