దశాబ్దాల తరబడి రాష్ట్రంలో బీజే పీకి సేవలందిస్తున్న సీనియర్ నేత ఇలగణేషన్‌కు ఢిల్లీ పెద్దలు ఈ సారి సముచిత న్యాయం కల్పించే అవకాశాలున్నాయి. ఆయన్ను రాజ్యసభకు పంపేందుకు బీజేపీ అధిష్టానం పరిశీలిస్తున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి.
సాక్షి, చెన్నై: తమిళనాడు బీజేపీలో ఇలగణేషన్ సీనియర్ నేత. ఆర్‌ఎస్‌ఎస్‌కు పూర్తి స్థాయి సేవకుడిగా ఉన్న ఆయన దశాబ్దాల తరబడి పార్టీకి విశిష్ట సేవల్ని అందిస్తున్నారు. ఆయన సేవలకు గుర్తింపుగా పార్టీ పరంగా పదవుల అందలం ఎక్కిస్తున్నారు. రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శిగా, ఉపాధ్యక్షుడిగా, అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం, చక్కటి వాక్ చాతుర్యం కలిగిన నాయకుడు ఇలగణేషన్. ప్రస్తుతం జాతీయ పార్టీ కౌన్సిల్ సభ్యుడిగా ఉన్నారు. కేంద్రంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే, ఈ సారైనా ఆయనకు న్యాయం చేకూర్చే విధంగా నిర్ణయాల్ని పెద్దలు తీసుకుంటారా..? అని ఎదురు చూసే కమలనాథులు రాష్ట్రంలో కోకొల్లలే.
అందుకు తగ్గ సమయం ఆసన్నమైంది. ఆయన పేరును రాజ్య సభ పదవికి ఎంపిక చేసేందుకు ఢిల్లీలోని కమలం పెద్దలు పరిశీలిస్తున్నారనే సమాచారం రాష్ట్ర బీజేపీ వర్గాల్లో ఆనందాన్ని రెకెత్తిస్తోంది. రాజ్య సభ సభ్యుడు నజ్మాహెప్తుల్లా మణిపూర్ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన దృష్ట్యా, ఆ పదవి ఖాళీగా ఉంది. ఆ స్థానం భర్తీకి అక్టోబరులో నోటిఫికేషన్ వెలువడనుంది. దీంతో ఆ పదవికి ఇలగణేషన్‌ను ఎంపిక చేయడానికి ఢిల్లీ పెద్దలు కసరత్తుల్లో ఉన్నట్టుగా సంకేతాలు వెలువడ్డాయి. మధ్యప్రదేశ్ నుంచి ఆయన్ను పెద్దల సభకు పంపించేందుకు తగ్గ పరిశీలన వేగవంతం చేశారు. ఈ సారి ఇలగణేషన్‌కు అవకాశం లభించనట్టేనని స్పందించే వాళ్లూ రాష్ట్ర పార్టీలో చాలామంది ఉన్నారు.
తమిళనాడులో బీజేపీ తరఫున ఏకైక ఎంపీగా కేంద్ర సహాయ మంత్రి పొన్ రాధాకృష్ణన్ మాత్రమే ఉన్నారు. ఆయనకు సహకారంగా, కేంద్ర పథకాలు తమిళనాట ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మరో ఎంపీ తప్పనిసరి అన్న నిర్ణయానికి ఢిల్లీ పెద్దలు వచ్చినట్టు చెబుతున్నారు. ఆయన సేవలకు గుర్తింపుగా తప్పనిసరిగా పదవి అప్పగించాల్సిన అవసరం ఉందంటున్నారు. అయితే, ఈ పదవికి ఎసరుపెట్టే విధంగా ఎవరైనా అడ్డుపడే అవకాశం కూడా ఉంది. ఇది వరకు పుదుచ్చేరి నుంచి ఎన్‌ఆర్ కాంగ్రెస్ సహకారంతో ఇలగణేషన్‌ను పెద్దల సభకు పంపేందుకు జరిగిన ప్రయత్నాలు బెడిసి కొట్టడమే. ఇందుకు నిదర్శనం.
ఛాన్స్ చిక్కినట్టేనా..!
Published Tue, Sep 27 2016 3:03 AM | Last Updated on Fri, Mar 29 2019 9:11 PM
Advertisement