‘డీఎస్పీ గణపతి ఆత్మహత్మ కేసు విషయంలో సాక్ష్యాలు నాశనమయినట్లు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ
∙ సీఎం సిద్ధు, మంత్రి జార్జి దిగిపోవాలి: యడ్యూరప్ప
సాక్షి, బెంగళూరు: ‘డీఎస్పీ గణపతి ఆత్మహత్మ కేసు విషయంలో సాక్ష్యాలు నాశనమయినట్లు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ నివేదికలో బయటపడింది. ఇందుకు నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పదవికి రాజీనామ చేయాలి.’ అని బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు యడ్యూరప్ప డిమాండ్ చేశారు. బెంగళూరులోని పార్టీ కార్యాలయంలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. డీఎస్పీ గణపతి చావుకు అప్పటి హోంశాఖ మంత్రి కే.జే జార్జ్ ప్రధాన కారణమని తాము మొదటి నుంచి చెబుతున్నామన్నారు. కేసును పక్కదోవ పట్టించడానికే సాక్ష్యాలను నాశనం చేశారన్నారు.
ఈ విషయాలన్నీ ఎఫ్‌ఎస్‌ఎల్ నివేదికలో బయటికి వచ్చాయన్నారు. ఇందుకు నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రితో పాటు మంత్రి కే.జే జార్జ్ వెంటనే పదవులకు రాజీనామ చేయాలన్నారు. లేదంటే ఈనెల 26న బీజేపీ రాష్ట్ర శాఖ తరఫున కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసి ఈ విషయమై ఫిర్యాదు చేస్తామన్నారు. ఈ కేసును సీబీఐతో దర్యాప్తు చేయించాలని కోరతామన్నారు. మాజీ ఐపీఎస్ అధికారి, రాష్ట్ర హోంశాఖ సలహాదారు కెంపయ్య వల్ల రాష్ట్ర పోలీసు వ్యవస్థ మొత్తం నాశనమవుతోందన్నారు. వెంటనే ఆయన్ను ఆ స్థానం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. కాగా, డీఎస్పీ గణపతి ఆత్మహత్య కేసుకు సంబంధించి కేంద్ర మంత్రి సదానందగౌడ కుమారుడు కార్తీక్‌గౌడ పేరు కూడా వినిపిస్తోంది కదా అన్న ప్రశ్నకు నిజంగా తప్పు చేసి ఉంటే శిక్ష పడాల్సిందేనన్నారు. మొత్తంగా డీఎస్పీ గణపతి కుటుంబానికి న్యాయం జరగాలన్నదే తమ అభిమతమని యడ్యూరప్ప పేర్కొన్నారు.