ప్రజల విశ్వాసం పొందలేకపోతే గెలవలేం
టీడీపీ శిక్షణా తరగతుల్లో చంద్రబాబు
సాక్షి, అమరావతి: అతి విశ్వాసం వల్ల 2004 ఎన్నికల్లో ఓడిపోయామని, ఈసారి కూడా ప్రజల విశ్వాసం లేకపోతే గెలవలేమని ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు చెప్పారు. ఆర్థిక అసమానతలు తగ్గకపోవడంవల్ల ఓటమి చవిచూడాల్సి వచ్చిందని, ఈసారి కూడా అలాంటి సమస్యలున్నాయని, అప్రమత్తంగా లేకపోతే ఇబ్బందిపడతామని చెప్పారు.
గుంటూరు జిల్లా వడ్డేశ్వరంలోని కేఎల్ విశ్వవిద్యాలయంలో మంగళవారం ప్రారంభమైన తెలుగుదేశం పార్టీ ముఖ్యనేతల మూడు రోజుల కార్యగోష్టి (శిక్షణా తరగతులు)కి చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ‘రాష్ట్ర విభజన ప్రక్రియ-సవాళ్లు-పటిష్ట నాయకత్వంతో పరిష్కారాలు’ అనే అంశంపై ప్రసంగించారు. నాయకులు నిత్యం ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలను పరిష్కరించాలని, వారిని ప్రభావితం చేయాలని కోరారు.