చెన్నై: ఆర్కే నగర్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ మంగళవారం నగరంలోని రాణీమేరీ కాలేజీలో ప్రారంభమైంది. ఉప ఎన్నికల ఫలితాలు మధ్యాహ్నం లేదా సాయంత్రానికి వెలువడనున్నాయి. ఈ ఎన్నికల్లో ముఖ్యమంత్రి జయలలిత గెలుపు ఖాయమని ఇప్పటికే అన్నాడీఎంకే నేతలు ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అయితే అమ్మకు ఎంత మెజార్టీ లభిస్తుంది అనే అంశంపై వారిలో ఉత్కంఠత నెలకొంది. జూన్ 27న ఆర్కేనగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికల జరిగిన సంగతి తెలిసిందే.
ఈ ఎన్నికల్లో సీపీఐ మాత్రమే తమ అభ్యర్థిగా మహేంద్రన్ ను బరిలో దింపగా... మిగిలిన 26 మంది స్వతంత్ర అభ్యర్థులుగా రంగంలో నిలిచారు. ఈ ఉప ఎన్నికల్లో 74.4 శాతం పోలింగ్ నమోదు అయింది. అయితే పాత వన్నార్పేటలో ఓటర్ల సంఖ్య కంటే అధిక శాతం పోల్ కావడంతో సదరు ప్రాంతంలో ఎన్నికల సంఘం సోమవారం రీపోలింగ్ నిర్వహించిన సంగతి తెలిసిందే.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కర్ణాటకలోని ప్రత్యేక కోర్టు అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు జైలు శిక్షతోపాటు పదేళ్ల పాటు ఎన్నికల్లో పోటీపై అనర్హత విధించింది. అందులోభాగంగా శ్రీరంగం నుంచి ప్రాతినిధ్యం వహించిన జయలలిత ఎమ్మెల్యే పదవితోపాటు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. అయితే దీనిపై ఆమె కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది. ప్రత్యేక కోర్టు ఆదేశాలను కొట్టివేసి.. జయను నిర్దోషిగా ప్రకటించింది. దీంతో ఆమె మళ్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆమె ఆరునెలల్లో మళ్లీ ఎమ్మెల్యేగా ఎన్నికల కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో జయలలిత ఆర్కే నగర్ నుంచి ఉప ఎన్నికల బరిలో దిగిన విషయం విదితమే.