ఒత్తిళ్లు నిజమే !
గణపతి ఆత్మహత్య ఘటనతుది నివేదిక లో సీఐడీ
తాను బలవన్మరణానికిపాల్పడతానంటూ గణపతి ఎస్సెమ్మెస్
జార్జ్ పాత్రను నిర్ధారించిన సీఐడీ ? ఆయనపై ఎఫ్‌ఐఆర్ నమోదుకు అనుమతి
ప్రభుత్వానికి ఇక్కట్లు తప్పవంటున్న నిపుణులు
బెంగళూరు: డీఎస్పీ గణపతి ఆత్మహత్యకు సంబంధించిన తుది నివేదికను సీఐడీ అధికారులు ప్రభుత్వానికి అందజేశారు. ఉద్యోగపరమైన ఒత్తిళ్లే గణపతి బలవన్మరణానికి కారణమని సీఐడీ విచారణలో తేలినట్లు సమాచారం. దీంతో ఇన్ని రోజులూ ప్రభుత్వం చెబుతూ వస్తున్నట్లుగా కుటుంబ పరమైన సమస్యల వల్ల గణపతి ఆత్మహత్య చేసుకున్నారన్న విషయం అబద్ధమని తేలింది. డీఎస్పీ గణపతి ఆత్మహత్య అంశానికి సంబంధించి సీఐడీ అధికారులు డీఎస్పీ గణపతి కుటుంబ సభ్యులతో పాటు పలువురిని విచారించారు. ఈ విచారణలో గణపతి ఆత్మహత్యకు వృత్తి పరంగా ఎదురైన ఒత్తిళ్లే కారణమని తేలినట్లు సమాచారం. ఇక ఈ అంశంతో పాటు పలు ఆసక్తికర అంశాలను సీఐడీ తన తుది నివేదికలో పేర్కొంది. ఆ వివరాలను ఓ సారి పరిశీలిస్తే...‘డీఎస్పీ గణపతి ఆత్మహత్యకు సంబంధించి కుటుంబ కలహాలు కారణం కాదు, విధి నిర్వహణలో ఎదురైన తీవ్ర ఒత్తిళ్ల కారణంగానే గణపతి ఆత్మహత్య చేసుకున్నారు. ఇక గణపతి ఆత్మహత్య విషయంలో స్థానిక పోలీసులు సైతం తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారు. జూలై 7న సాయంత్రం 5 గంటలకు స్థానిక పోలీసులకు డీఎస్పీ గణపతి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసింది.
అయినప్పటికీ స్థానిక ఎస్‌ఐ మేదప్ప ఈ విషయాన్ని గణపతి భార్య పావనకు తెలియజేయలేదు. అంతేకాదు రాత్రి ఎనిమిది గంటల వరకు కనీసం విచారణను కూడా ప్రారంభించలేదు. ఇక గణపతి తండ్రి కుశాలప్పను ఎనిమిది గంటల సమయంలో పిలిపించినప్పటికీ ఆయనకు గణపతి ఇంటర్వ్యూ గురించి స్థానిక పోలీసులు సమాచారం ఇవ్వలేదు. తండ్రి కుశాలప్ప నుంచి ప్రాథమిక సమాచారాన్ని సేకరించిన తర్వాత గణపతి మరణ వార్తను ఆయన భార్య పావనకు తెలియజేశారు. ఈ విషయంలో స్థానిక పోలీసులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఇక సీఆర్‌పీసీ 174 ప్రకారం గణపతి మృతిని అసహజ మరణంగా కేసు నమోదు చేశారు తప్పితే ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు చేయలేదు’ అని సీఐడీ తన తుది నివేదికలో పేర్కొంది.
ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ సోదరుడికి ఎస్‌ఎంఎస్....
కాగా, గణపతి ఆత్మహత్యకు ముందు తాను ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు సోదరుడు డీఎస్పీ తమ్మయ్యకు ఎస్‌ఎంఎస్ పంపినట్లు సీఐడీ విచారణలో వెల్లడైంది. అయితే చాలా సేపటి వరకు తమ్మయ్య ఆ ఎస్‌ఎంఎస్‌ను చూసుకోలేదని సీఐడీ అధికారులు తమ నివేదికలో పేర్కొన్నారు. ‘గణపతి పంపిన ఎస్‌ఎంఎస్‌ను తమ్మయ్య చాలా సేపటి వరకు చూసుకోలేదు. స్థానిక ఛానల్‌లో గణపతి ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రసారమవుతున్న సమయంలో ఆయన తన సెల్‌ఫోన్‌లో ఉన్న ఎస్‌ఎంఎస్ చూసుకున్నారు. దీంతో టవర్ లొకేషన్ ఆధారంగా గణపతి ఎక్కడున్నారో తెలుసుకోవాల్సిందిగా మంగళూరు పోలీసులకు సూచించారు. అప్రమత్తమైన మంగళూరు పోలీసులు టవర్ లొకేషన్ ఆధారంగా గణపతి మడికేరిలోని ఓ లాడ్జిలో ఉన్నట్లు గుర్తించి అక్కడికి చేరుకున్నారు. అప్పటికే డీఎస్పీ గణపతి ఆత్మహత్యకు పాల్పడ్డారు’ అని సీఐడీ నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం.
జార్జ్ పాత్రపై ఆధారాలున్నాయి!
ఇక డీఎస్పీ గణపతి ఆత్మహత్యకు సంబంధించి మంత్రి కె.జె.జార్జ్ పాత్రపై సాక్ష్యాలు లభించినట్లు సీఐడీ తన నివేదికలో పేర్కొందని ఉన్నత స్థాయి వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో కె.జె.జార్జ్ పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసేందుకు అనుమతి ఇవ్వాలంటూ సీఐడీ ప్రభుత్వాన్ని కోరినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు డీఎస్పీ గణపతి ఆత్మహత్యకు కుటుంబ కలహాలే కారణమంటూ ప్రభుత్వం చెబుతూ వచ్చిన నేపథ్యంలో సీఐడీ అందజేసిన నివేదిక రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యంగా మంత్రి కె.జె.జార్జ్‌ను చిక్కుల్లో పడేసిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.