రాయచూరు లోకసభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ
రాయచూరు రూరల్ , న్యూస్‌లైన్: రాయచూరులో నేడు(గురువారం) జరిగే లోక్‌సభ ఎన్నికలకు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ, బీజేపీ మధ్యే గట్టి పోటీ నెలకొంది. కాంగ్రెస్ పార్టీ నుంచి బీవీ నాయక్, బీజేపీ నుంచి శివనగౌడనాయక్, జేడీఎస్ నుంచి డీబీ నాయక్, బీఎస్పీ నుంచి తిమ్మప్పనాయక్, చిన్నయ్యనాయక్, సోమశేఖర్ , నాగరాజ, భగవంతప్ప రంగంలో ఉన్నారు.
ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ మధ్యే ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. బీజేపీ అభ్యర్థి ధన అధికార బలంతో గెలుపు తథ్యంగా భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నాయక్ పాత వాడైనా గత ఇరవై ఏళ్లుగా కాంగ్రెస్ ఎంపీగా ఉన్న వెంకటేష్‌నాయక్ ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేకపోయారనే విమర్శలున్నాయి. జేడీఎస్ అభ్యర్థి తన ఉనికిని చాటుకునేందుకు గట్టి ప్రయత్నాలు సాగిస్తున్నారు.
రాయచూరు లోకసభ నియోజకవర్గంలో ఎనిమిది అసెంబ్లీ స్థానాలున్నాయి. రాయచూరు జిల్లాలో తుంగభద్ర ఎడమ కాలువ, కృష్ణానదిపై నారాయణపూర్ కుడికాలువ, రాష్ట్రానికి 45 శాతం విద్యుత్ ఉత్పత్తి చేసే విద్యుత్ స్థావరాలు, బంగారు నిక్షేపాలు గల హట్టి ప్రాంతాలు ఉన్నా రాయచూరు లోకసభ నియోజకవర్గం అన్ని రంగాల్లోనూ వెనకబడి ఉంది.
ప్రస్తుతం 16వ లోకసభకు జరగనున్న ఎన్నికల్లో ప్రాంతీయ అసమానతల నివారణకు ఉద్దేశించిన నంజుండప్ప నివేదికలో తేటతెల్లమైంది. అత్యంత వెనకబడిన జిల్లాగా కీర్తి ఉంది. 60 ఏళ్ల పాలనలో అనుకున్నంత అభివృద్ధి సాధించలేకపోయింది. ఈసారి జరిగే ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు వెనుకబడిన జాబితా నుంచి తొలగిస్తారో? లేదో? వేచి చూడాలి. 15 సార్లు జరిగిన ఎన్నికల్లో 12 సార్లు కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. 1967లో స్వతంత్ర అభ్యర్థి రాజా వెంకటప్పనాయక్ 1996లో రాజా రంగప్ప నాయక్ గెలిచారు.