పాతకు పూత!
Published Thu, Nov 21 2013 12:56 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
సాక్షి, న్యూఢిల్లీ: నాలుగోసారి ఢి ల్లీ ఓటర్ మనసు ‘గెలుచుకోవడమే’లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోను రూపొందించింది. అయితే అందులో ప్రస్తుతం అమలులో ఉన్న పథకాల కొనసాగింపు మినహా కొత్తదనమేదీ కనిపించలేదు. ఢిల్లీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ఉటంకిస్తూ వాటిని భవిష్యత్తులో ఎలా అమలు చేయబోతున్నది వివరించారు. పదిహేనేళ్లలో ఢిల్లీ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని, మరోమారు అవకాశం ఇస్తే అద్భుతాలు చేసి చూపుతామన్న హామీఇస్తూ ఆ పార్టీ మేనిఫోస్టోను రూపొం దించింది. ఢిల్లీ విధానసభ ఎన్నికల మేనిఫెస్టోను డీడీయూ మార్గ్‌లోని రాజీవ్‌భవన్‌లో ఢిల్లీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ బుధవారం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు కపిల్‌సిబల్, కృష్ణతీరథ్, డీపీసీసీ అధ్యక్షుడు జేపీ అగర్వాల్, మంత్రి కిరణ్ వాలియా, ఢిల్లీ ఎన్నికల ఇన్‌చార్జీ షకీల్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఢిల్లీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ మాట్లాడారు. ‘రుకేగా నహీ హమారా ఢిల్లీ’ నినాదంతో ముందుకు వెళుతున్నామన్నారు. పదిహేనేళ్లలో ఢిల్లీలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయన్నారు. నాలుగోమారు అధికారంలోకి వస్తే ఢిల్లీలో డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్లు నిర్మిస్తామన్నారు. ఢిల్లీ నగర సంఘటిత అభివృద్ధికి మరింత కృషి చేస్తామన్నారు. ఉపాధి, ఉద్యోగాల కోసం దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఢిల్లీకి వలసవచ్చేవారంతా ఇక్కడి సదుపాయాల చూసి తిరిగి వెళ్లేందుకు ఇష్టపడరన్నారు. వారికోసం మరిన్నిమెరుగైన సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. దేశంలోనే అత్యధికంగా ఢి ల్లీలో జీడీపీ ఉందని దీన్ని మరో ఐదేళ్లలో రెట్టింపు చేసేందుకు కృషి చేస్తామన్నారు. ఇతర పార్టీలమాది రి తప్పుడు హామీలు కాకుండా ఇచ్చిన అన్ని వాగ్ధానాలు గతంలో నెరవేర్చినట్టే నాలుగోమారు అధికారంలోకి వచ్చిన తర్వాత నిలబెట్టుకుంటామన్నారు.
కాంగ్రెస్ మేనిఫెస్టోలోని వివరాలు అంశాల వారీగా...
ఉన్నత విద్య..
ఢిల్లీయూనివర్సిటీ పరిధిలోని కళాశాల్లో 30 శాతం సీట్లు పెంచడంతోపాటు విద్యార్థులకు సరిపడా రాత్రి కళాశాలల నిర్వహణ. విద్యార్థులకు లోన్లు ఇప్పించడం, ఆర్థికంగా వెనుకబడిన తరగతుల విద్యార్థులకు ఉన్నత విద్యలో రాయితీలు కల్పిచనున్నట్టు హామీ.
మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి..
ఢిల్లీలో మహిళల భద్రతపై ప్రత్యేంగా దృష్టి. మహిళలపై జరుగుతున్న నేరాల విచారణకు పోలీసులకు ప్రత్యేక శిక్షణ. మహిళలను గౌరవించేలా అవగాహన శిబిరాల ఏర్పాటు. పోలీస్ వ్యవవస్థలో మహిళల సంఖ్య పెంపు. పోలీస్ వ్యవస్థలో సంస్కరణలకు చర్యలు.
అన్ని వర్గాల సంక్షేమానికి చర్యలు...
ప్రస్తుతం ఢిల్లీలో అమలులో ఉన్న సంక్షేమ పథకాలను మరింత సమర్ధవంతంగా అమలు చేసేందుకు చర్యలు. వీటిల్లో భాగంగా అన్ని వర్గాలకు లబ్ధి చేకూరేలా పథకాల అమలు. వృద్ధులకు కంటి పరీక్షలు చేయించడం, వారికి అవసరమైన చేతి కర్రలు, వాకర్లు ఇతర వస్తువులను రాయితీపై ఇవ్వడం. వారికి ఆశ్రయం కల్పించేందుకు పది వృద్ధాశ్రమాలు నిర్మించడం. మానసిక రోగులకు నరేలాలో ఓ ఆసుపత్రి నిర్మాణం. వికలాంగ విద్యార్థులకు ఉపకార వేతనాల పెంపు. బిక్షగాళ్ల సమస్యల పరిష్కారానికి చర్యలు. వీటితోపాటు ఇప్పటికే అమలులో ఉన్న బాగీదారి పథకాన్ని మరింత పటిష్టంగా అమలు చేయడం. ఆహారభద్రత పథకం కింద దాదాపు 73 లక్షల మందికి లబ్ధి చేకూరేలా చేయడం. అంత్యోదయ, అన్నశ్రీయోజన పథకాలతో వీలైనంత ఎక్కువ మందికి లబ్ధి చేకూర్చడం. లాడ్లీ పథకాన్ని కొనసాగింపుగా ఆర్థిక సహాయాన్ని రూ.50వేలకు పెంచడం. మహిళలకు ప్రత్యేకంగా టాయిలెట్ల నిర్మాణం. ఒక్కో నియోజకవర్గ పరిధిలో కనీసం 20 ఉండేలా చర్యలు.
పట్టణాభివృద్ధి...
ఢిల్లీ నగరాన్ని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దడం. వీటితోపాటు ఢిల్లీలోని గ్రామీణ ప్రాంతాలు, అనధికారిక కాలనీలుల్లో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేయడం. జేజే క్లస్టర్లలోని వారికోసం జేఎన్‌ఎన్‌యూ ఆర్‌ఎం పథకం కింద నాలుగు లక్షల ఇళ్లను నిర్మించి ఇవ్వడం.
తాగునీటి సమస్యలపై దృష్టి..
ఢిల్లీ జల్‌బోర్డు ద్వారా తాగునీరు అందేలా చర్యలు. గృహ వినియోగదారులకు ప్రస్తుతం ఉన్న నీటి సరఫరాను నెలకు 30 కిలో లీటర్ల నుంచి 40కిలో లీటర్లకు పెంచడం. ద్వారకా, బవానా, ఓక్లాల్లో మూడు మంచినీటి శుద్ధి కేంద్రాల ఏర్పాటు. లీకేజీలు అరికట్టేందుకు చర్యలు.
నిరంతర విద్యుత్ సరఫరా..
నిరంత విద్యుత్ సరఫరాతోపాటు విద్యుత్ చార్జీల్లో ఎలాంటి అవకతవకలు లేకుండా ఉండేందుకు స్మార్ట్ ఎలక్ట్రిక్ మీటర్లను ఏర్పాటు చేయడం. మెరుగైన విద్యుత్ సరఫరాకు మరో 15 సబ్‌స్టేషన్లను ఏర్పాటు చేయడం. మూడు గ్యాస్ గ్రిడ్ సబ్‌స్టేషన్లను ఏర్పాటు చేయడం.
మెరుగైన రవాణా సదుపాయాలు:
మోనోరైలు, ట్రామ్స్‌ను ప్రవేశపెట్టడం. క్లస్టర్ బస్సుల సంఖ్యను 5,500కి పెంచడం. ఫేజ్-3 లో 91 స్టేషన్లతో 136 కి.మీ., ఫేజ్-4లో 113 కి.మీ. మెట్రోలైన్ నిర్మాణం.80 రూట్లలో 400 ఫీడర్‌బస్సులను అందుబాటులోకి తేవడం. డీటీసీలో మరిన్ని లోఫ్లోర్‌బస్సులు.
Advertisement
Advertisement