ప్రొటెం స్పీకర్‌పై పీటముడి
Published Wed, Jan 1 2014 12:41 AM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వం ఏర్పాటు తరువాత విధానసభ ప్రొటెం స్పీకర్ ఎవరవుతారనే విషయంపై పీటముడిపడింది. ప్రొటెం స్పీకర్ పదవీబాధ్యతలు స్వీకరించడానికి బీజేపీ సీనియర్ నాయకుడు జగ్దీశ్‌ముఖి తిరస్కరించారు. మరోవైపు ఈ పదవిని స్వీకరించడానికి జనతాదళ్ యూ సభ్యుడు షోయబ్ ఇక్బాల్ కూడా సిద్ధంగా లేరు. జనవరి ఒకటో తేదీ నుంచి విధానసభ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రొటెం స్పీకర్ నియామకం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.
లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్.. బీజేపీ ఎమ్మెల్యే జగ్దీశ్‌ముఖిని ప్రొటెం స్పీకర్‌గా నియమించినప్పటికీ ఆయన ఈ పదవీ బాధ్యతలు స్వీకరించ డానికి నిరాకరించారు. పార్టీ ఎమ్మెల్యేలు ఎవరూ ప్రొటెం స్పీకర్ పదవిని స్వీకరించరాదని అధిష్టానం నిర్ణయించిందని ముఖి చెప్పారు. దీంతో ఈ విషయాన్ని విధానసభ కార్యదర్శికి తెలియజేసినట్లు ఆయన చెప్పారు. విధానసభ లో అత్యంత సీనియర్ శాసనసభ్యుడిని ప్రొటెం స్పీకర్‌గా నియమించడం ఆనవాయితీ. ఈమేరకు ఎల్జీ... జగ్దీశ్ ముఖిని ప్రొటెం స్పీకర్‌గా నియమించారు. ప్రొటెం స్పీకర్‌తో ఎల్జీ ప్రమాణస్వీకారం చేయిస్తారు ఆ తరువాత ప్రొటెం స్పీకర్ కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులతో ప్రమాణస్వీకారం చేయిస్తారు.
ఆ తరువాత శాసనసభ్యులు స్పీకర్‌ను ఎన్నుకుంటారు. అయితే ఈ ఆనవాయితీకి భిన్నంగా స్పీకర్ ఎన్నికకు మునుపే విధానసభలో తమ బలాన్ని నిరూపించుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రొటెం స్పీకర్ అధ్యక్షతన ప్రభుత్వం అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకోరాదనే నిబంధన ఏదీ లేనప్పటికీ సాధారణంగా స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌ల ఎన్నిక పూర్తయ్యాక ప్రభుత్వం విశ్వాసతీర్మానాన్ని ప్రవేశపెట్టడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ప్రొటెం స్పీకర్ అధ్యక్షతన విశ్వాసతీర్మానాన్ని ప్రవేశపెట్టిన తరువాత స్పీకర్ ఎన్నిక జరిపించాలని ఆప్ ప్రభుత్వం నిర్ణయించడం రాజకీయ పండితులకు కూడా ఆశ్చర్యం కలిగించింది. 2005లో జార్ఖండ్‌లో కోర్టు ఆదేశాల మేరకు ప్రొటెం స్పీకర్ విశ్వాస తీర్మాన ప్రక్రియను నిర్వహించారని రాజకీయ పండితులు ఈ సందర్భంగా గుర్తుచేస్తున్నారు.
జనవరి ఒకటి నుంచి ఏడో తేదీ దాకా విధానసభ సమావేశాలు జరగనున్నా యి. ఒకటో తేదీన ప్రొటెం స్పీకర్ అధ్యక్షతన శాసనసభ్యుల ప్రమాణ స్వీకారం జరుగనుంది. రెండో తేదీన విశ్వాసతీర్మానాన్ని ప్రవేశపెట్టాలని, మూడో తేదీన స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరిపించాలని ఆప్ మంత్రిమండలి నిర్ణయించింది. స్పీకర్, డిప్యూటీ ఎన్నిక సమయంలో కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేయొచ్చనే భయంతో ఆప్ ప్రభుత్వం స్పీకర్ ఎన్నికను బలనిరూపణ తరువాత నిర్వహించాలని నిర్ణయించిందని అంటున్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేని ప్రొటెం స్పీకర్‌గా నియమించడం వల్ల శాసనసభ్యుల సంఖ్య 31కి తగ్గుతుందని, బలనిరూపణ సమయంలో తమ సంఖ్యాబలం తగ్గితే వారికి అనుకూలంగా ఉంటుందనే ఉద్దేశంతోనే స్పీకర్ ఎన్నికను మూడో తేదీన నిర్వహించాలని ఆప్ నిర్ణయించిందని బీజేపీ వర్గాలు అంటున్నాయి.మతీన్‌కు పదవికాంగ్రెస్ ఎమ్మెల్యే మతీన్ అహ్మద్ ప్రొటెం స్పీక ర్ అవుతారని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవా ల్ మంగళవారం ప్రకటించారు. ‘మేము మతీన్ పేరును ప్రతిపాదించాం. ఆయనే ప్రొటెం స్పీకర్ అవుతారు’ అని పేర్కొన్నారు.
Advertisement